Begin typing your search above and press return to search.

మునుగోడు ఎన్నిక ఆపాలని హైకోర్టులో పిల్.. కేఏ పాల్ మరో సంచలనం

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:31 PM GMT
మునుగోడు ఎన్నిక ఆపాలని హైకోర్టులో పిల్.. కేఏ పాల్ మరో సంచలనం
X
కేఏ పాల్.. ఈ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. మత ప్రబోధకుడికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటేనే ప్రజా సేవ గుర్తుకు వస్తుంది. సడెన్ గా వస్తాడు. ఆ ఎన్నికల్లో పోటీచేస్తాడు.డిపాజిట్లు కూడా తెచ్చుకోకుండా చిత్తుగా ఓడి అమెరికా చెక్కేస్తాడు. మళ్లీ ఎన్నికలు వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో వాలుతాడు. అంతటి పాల్ ప్రస్తుతం మునుగోడు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వాలిపోయాడు. లక్ష కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించండని అంటున్నాడు.

మునుగోడు ఉప ఎన్నికలు రాజుకుంటున్న వేళ కేఏ పాల్ సైతం బరిలోకి దించుతున్నారు.తన ప్రజాశాంతి పార్టీ తరుఫున ప్రజా గాయకుడు గద్దర్ ను ఎన్నికల బరిలో నిలుపుతున్నారు. గెలుపు కోసం ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు సర్వశక్తులు ఒడ్డుతున్న వేళ కేఏ పాల్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు.

ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్ ను నిలబెట్టిన పాల్ ఈ క్రమంలోనే టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నామినేషన్లకు ముందే ఈ మూడు పార్టీలు కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారని.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓటర్లకు డబ్బులు, బహుమతులు పంచుతున్నారని ఆరోపించారు.

అందుకే ఇంతటి డబ్బు ప్రవాహం పారుతున్న మునుగోడులో వెంటనే ఉప ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్ పిటీషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని పాల్ సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటికే ఈ ఎన్నిక కోసం అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ బోలెడంత ఖర్చు చేస్తూ ముందుకెళుతున్న వేళ ఎన్నికను ఆపాలని పాల్ న్యాయపోరాటం చేయడం రాజకీయాలను షేక్ చేస్తోంది. హైకోర్టు ఏం తేలుస్తుందన్నది ఉత్కంఠగా మారింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా? కొట్టివేస్తుందా? అన్నది చూడాలి.