Begin typing your search above and press return to search.

కేఏ పాల్.. ఆ పని చేయబోతున్నాడా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 1:30 AM GMT
కేఏ పాల్.. ఆ పని చేయబోతున్నాడా?
X
రాజకీయాల్లో పాల్ కామెడీ కొత్త ఏమీ కాదు. పదేళ్ల కిందటే చాలా హడావుడి చేశాడు. తనకు అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నాయని.. అప్పట్లో బుష్ - సోనియాలు కూడా తన మాటను కాదనలేరని.. ఇలా ఏదేదో మాట్లాడాడు. అలా మాట్లాడటంతో అతడిని ఒక కమేడియన్ లాగా చూశారు జనాలు. చివరకు అతడు కమేడియనే అని నిరూపించుకొంటూ వస్తున్నాడు.

అప్పట్లో తనకు వ్యతిరేకంగా బుష్ కుట్ర చేశాడు - కండోలిజా రైస్ కుట్ర చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్ర చేశాడని అంటూ నానా కంగాళీ చేశాడితను. ఆ తర్వాత పాల్ ను మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడితను. ఒక హత్య కేసులో కూడా అభియోగాలు ఎదుర్కొన్నాడు. పూర్తి వివాదాస్పదుడు అయ్యాడు.

తీరా గత ఎన్నికల ముందు మళ్లీ వచ్చాడు. తన ప్రజా శాంతిపార్టీ అంతటా పోటీ చేస్తుందని ప్రకటించాడు. తీరా ఎన్నికల సమయం వచ్చాకా చేతులు ఎత్తేశాడు. అదేమంటే… అప్పట్లో తన లాప్ టాప్ పోయిందని - అందులో కీలకమైన వివరాలు ఉండేవని.. అది పోవడంతో తను పార్టీపోటీ చేయలేకపోయినట్టుగా చెప్పుకున్నాడు. యథారీతిన కామెడీ చేశాడు.

ఇక ఇప్పుడు మళ్లీ టీవీ చానళ్లలో కేఏ పాల్ కామెడీ కొనసాగుతూ ఉంది. ఇతడు ఈ సారి కూడా పాత హడావుడే చేస్తున్నాడు. ‘ఒక్కో నియోజకవర్గానికి కోట్ల రూపాయలను ఇవ్వగలను..’ అని చెప్పుకుంటున్నాడు. ఈ మాటలు వింటూ జనాలు నవ్వుకుంటున్నారు. టీవీ చానళ్లు కూడా ఇతడిని ఒక జోకర్ గా కూర్చోబెడుతున్నాయి. ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు యాంకర్లు. అయినా పాల్ మాత్రం అదేమీ అర్థం కానట్టుగా ఏదేదో చెబుతూ ఉంటాడు.

ఇక ఇప్పుడు హడావుడి చేస్తూ తన దగ్గరకు వచ్చిన వాళ్లను చందాలు అడుగుతున్నాడట కేఏ పాల్. దీంతో వారు అవాక్కవుతున్నారు. ‘ప్రపంచాన్ని శాసించగలను..’అని చెప్పే ఈ వ్యక్తి ఇలా చందాలు అడగడం ఏమిటని వారు అంటున్నారు. ఇదీ పాల్ కథ. ఈ సారి కూడా ఇతడి కథ పాతదే అని - తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకా ఇతడు జాడ లేకుండా పోవడమో - ఏదైనా కుంటిసాకు చెప్పడమో ఖాయమని పరిశీలకులు అంటున్నారు.