Begin typing your search above and press return to search.

పార్టీ కండువాలు లేని కేఏ పాల్.. ఏపీలో స్వీప్ చేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   5 March 2019 4:16 AM GMT
పార్టీ కండువాలు లేని కేఏ పాల్.. ఏపీలో స్వీప్ చేస్తార‌ట‌!
X
హాట్ హాట్ గా మారిన ఏపీ రాజ‌కీయాల్లో అంతో ఇంతో రిలాక్స్ కావ‌టానికి మార్గం లేదా? హాట్ సీజ‌న్ లో మ‌రింత హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ రాజ‌కీయాల్లో ఆ వేడిని త‌గ్గించే వారెవ‌రు? ఈ వేడిలో ఉడికిపోవాల్సిందేనా? అన్న సందేహాల‌కు స‌మాధానం దొరికిన‌ట్లే. కేఏ పాల్ నేతృత్వంలోని ప్ర‌జాశాంతి పార్టీ ఆ లోటును తీర్చనుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఏపీలోని ప్ర‌తి ప‌ది ఓట్ల‌లో ఆరు ఓట్లు త‌మ పార్టీకే ప్ర‌స్తుతం ఉన్న‌ట్లుగా కేఏ పాల్ ధీమాగా చెబుతున్నారు. మాష్టారు మ‌ర్చిపోయిన పాయింట్ ఏమంటే.. ప్ర‌తి ప‌ది ఓట్లకు ముందు పోల్ అయ్యే ఓట్లే ఏడే. అందులో ఆరు పాల్ గారి పార్టీవైతే.. మిగిలిన పార్టీల మాటేంటి? ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలుసా.. పాల్ గారి పార్టీ సునామీ సృష్టించ‌నుంద‌ట‌.. ఏపీలో స్వీప్ చేస్తార‌ట‌. ఇంత‌కీ.. పాల్ సార్ వారు ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న క్వ‌శ్చ‌న్ అడిగితే క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. త‌న‌తో డిబేట్ కు దిగితే మాత్రం అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లోనే బ‌రిలోకి దిగుతార‌ని చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ కానీ త‌న‌తో డిబేట్ కు దిగితే పులివెందుల నుంచి పోటీ చేస్తాన‌ని.. అదే చంద్ర‌బాబు త‌న‌తో డిబేట్ కు వ‌స్తే కుప్పం నుంచి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇన్ని మాట‌లు చెప్పిన కేఏ పాల్ వారి పార్టీ కండువాల‌కు కొర‌త ఏర్ప‌డింద‌ట‌. కండువాల మాట రాగానే.. కండువాలు లేవు కానీ.. మ‌న పార్టీ నేత‌ల పేర్లు చ‌దివేయండంటూ ఆయ‌న హ‌డావుడి చేయ‌టం క‌నిపించింది.

బాబు.. జ‌గ‌న్ ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని.. త‌మ పార్టీని గెలిపించేందుకు అంద‌రూ సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పే కేఏ పాల్.. త‌న పార్టీ సింబ‌ల్ హెలికాఫ్ట‌ర్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చివ‌ర‌కు జ‌ర్న‌లిస్టు సోద‌రులు సైతం.. ర‌హ‌స్యంగా అయినా స‌రే.. హెలికాఫ్ట‌ర్ గుర్తుకు ఓటు వేయాల‌ని వ్యాట్సాప్ ల‌లో ప్ర‌చారం చేస్తార‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు.

పాల్ గారు పోటీ చేయ‌టానికి ఐదు అసెంబ్లీ స్థానాల్ని.. ఐదు లోక్ స‌భ స్థానాల్ని ప‌రిశీలిస్తున్నాన‌ని.. త్వ‌ర‌లోనే డిసైడ్ చేస్తాన‌ని పాల్ చెప్పారు. 1979లో టెన్త ఫెయిల్ అయిన తాను ఆ త‌ర్వాత ఓట‌మి అన్న‌దే త‌న ద‌రికి చేర‌లేద‌న్నారు. రేవంత్ రెడ్డి మాదిరి ఓడితే అలా చేస్తా.. ఇలా చేస్తా లాంటి మాట‌లు తాను చెప్ప‌న‌ని.. అబ‌ద్ధాలు చెప్ప‌టం త‌న‌కు చేత‌కాద‌న్నారు. అయినా.. త‌మ పార్టీ గెలుస్తుంద‌ని.. విజ‌యం సాధిస్తుంద‌ని.. అలాంట‌ప్పుడు ఓడితే ఏమిట‌న్న ప్ర‌శ్నే త‌లెత్త‌ద‌ని స్ప‌ష్టం చేశారు. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. తాజా ఎన్నిక‌ల్లో ఏపీలో పుట్టే అగ్గిని కాసింత కూల్ చేయ‌టంలో మాత్రం కేఏ పాల్ స‌క్సెస్ అవుతార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.