Begin typing your search above and press return to search.

లంక‌లో పాల్‌!.. ఏం చేస్తున్నార‌బ్బా?

By:  Tupaki Desk   |   29 April 2019 4:17 PM GMT
లంక‌లో పాల్‌!.. ఏం చేస్తున్నార‌బ్బా?
X
ఏపీలో ఇటీవ‌ల ముగిసిన పోలింగ్ దాకా జ‌గన్‌, చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుంటే... ఆ వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తూ ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్‌, క్రైస్త‌వ మ‌త బోధ‌కుడు కేఏ పాల్ మాబాగా కామెడీ పండించారు. ఓ వైపు ఘాటు వ్యాఖ్య‌లు దూసుకువ‌స్తుంటే... పాల్ నోట నుంచి వ‌చ్చిన కామెడీ పీస్ లు బాగానే అల‌రించాయ‌ని చెప్పాలి. మొత్తంగా ఎన్నిక‌ల్లో క‌మెడియ‌న్ పాత్ర‌ను పోషించిన పాల్‌... పోలింగ్ ముగియ‌గానే అడ్రెస్ లేకుండా పోయారు. స‌రే... ప్ర‌చారంలో అల‌సిపోయారు క‌దా.. కాస్తంత విశ్రాంతి కోసం ఎక్క‌డికైనా టూర్ వెళ్లి ఉంటారులే అని అంతా అనుకున్నారు.

అలా టూర్ల‌కు వెళ్లే ల‌క్ష‌ణం పాల్ కు లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... రాజ‌కీయాల్లోకి రాక‌ముందు క్రైస్త‌వ మ‌త బోధ‌కుడిగా పాల్ కు ఒక్క భార‌త దేశంలోనే కాదు ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మంచి పేరే ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ ఉప‌ద్ర‌వం సంభ‌వించినా... పాల్ ఆధ్వ‌ర్యంలో ఒక‌ప్పుడు న‌డిచిన సంస్థ అక్క‌డ వాలిపోయేది. చేత‌నైన సాయం చేసేది. ఇలా పాల్ చాలా దేశాల అదినేత‌ల‌కు చిర ప‌ర‌చితులే. అందుకే నిద్ర లేచింది మొద‌లు అమెరికా అధ్యక్షుడి నుంచి శ్రీ‌లంక అధ్యక్షుడి దాకా ఎంద‌రెంద‌రో ప్ర‌ముఖుల పేర్ల‌ను పాల్ అలా ప‌లికేస్తూ ఉంటారు. మొత్తంగా త‌న‌ను తాను ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ గానే ఆవిష్క‌రించుకునే య‌త్నంలో పాల్ కామెడీ అయిపోయినా... ఆయ‌న‌కు మాత్రం చాలా దేశాల్లో మంచి ప‌లుకుబ‌డే ఉంది. ఎక్క‌డికి వెళ్లినా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు ల‌భిస్తాయి.

ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ‌లంక‌లో ఇటీవ‌లే ఉగ్ర‌వాద దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఈ నేపధ్యంలో అక్కడ శాంతి నెలకొనేందుకు తన వంతు ప్రయత్నం చేయడానికి కేఏ పాల్ శ్రీలంక వెళ్లారు. అక్క శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సేతో భేటీ అయ్యారు. గ‌తంలో లంక‌లో సునామీ వ‌చ్చిన‌ప్పుడు కేఏ పాల్ ఆ దేశానికి ఆప‌న్న హ‌స్తం అంద‌జేశారు. నాడు లంక అధ్యక్షుడిగా ఉన్న రాజ‌ప‌క్స‌.... నాటి సంగ‌తుల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌రీ పాల్ ను త‌న ఇంటికి పిలిచి అతిథి మ‌ర్యాద‌లు చేశారు. ఆ ఫొటోలే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.