Begin typing your search above and press return to search.

చంద్రబాబే కోడెలని తిట్టించారు...

By:  Tupaki Desk   |   18 Sep 2019 1:05 PM GMT
చంద్రబాబే కోడెలని తిట్టించారు...
X
ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విషయం తెలిసిందే. కోడెల ఆత్మహత్యపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టించి కక్ష సాధింపు చర్యలు చేయడం వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంటే....చంద్రబాబు పట్టించుకోపోవడం వల్లే కోడెల చనిపోయారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు సంచలన విషయాలు బయటపెట్టారు. కోడెల బీజేపీలో చేరాలని అనుకున్నారని చెపుతున్నారు. కోడెలని చంద్రబాబు తీవ్ర అనుమానాలకు గురిచేశారని బీజేపీ అధికార ప్రతినిధి కేవీ లక్ష్మీపతి రాజా ఆరోపించారు.

అయితే కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమేనని - టీడీపీలో చంద్రబాబు అవమానాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలతో కోడెల చెప్పారని అన్నారు. అసలు తనను కలవడానికి కనీసం చంద్రబాబు అపాయింట్‌ మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందినట్టు వెల్లడించారు. అలాగే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో కోడెలను వర్ల రామయ్యతో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. అంతకు ముందు కోడెల ఆత్మహత్యాయత్నం చేసినా చంద్రబాబు పరామర్శించలేదని చెప్పారు.

అయితే బీజేపీలో చేరేందుకు అమిత్ షాను కలిసే ఏర్పాటు చేయాలని కోడెల బీజేపీ నేతలతో మాట్లాడారని - ఆయన బ‌తికివుంటే త్వరలోనే బీజేపీలో చేరేవారని చెప్పుకొచ్చారు. ఇక కోడెల‌ను బ‌తికి ఉన్నప్పుడు పట్టించుకొని చంద్రబాబు చనిపోయిన వెంటనే శవరాజకీయాలు చేస్తున్నారని - ఇలాంటి నాయకుడుని వదిలేసి మిగతా నేతలు బయటకు రావాలని సూచించారు. అదేవిధంగా కోడెలని చంద్రబాబు వాడుకుని వదిలేశారని - ఆయన మరణంపై అనేక అనుమానాలున్నాయని - సమగ్ర దర్యాప్తు జరపాలని మరో బీజేపీ నేత రఘురాం ఆరోపణలు చేశారు.