Begin typing your search above and press return to search.

సుజ‌నా...ప్రజాస్వామ్యంలో చెల్ల‌ని నోటు అవుతావు

By:  Tupaki Desk   |   15 Nov 2016 2:25 PM GMT
సుజ‌నా...ప్రజాస్వామ్యంలో చెల్ల‌ని నోటు అవుతావు
X
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దయిన కరెన్సీ నోట్లతో సమానమని కేంద్రమంత్రి సుజనా చౌదరి వాఖ్యానించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి రాజకీయ నాయకునిగా వ్యవహరించకుండా - నోటికొచ్చినట్లు వాఖ్యానించడం ఆయన వ్యాపార దోరణికి అద్దం పడుతుందని మండిప‌డ్డారు. రాష్ట్రానికి 10 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ - 15 ఏళ్ళ సాధిస్తామని టీడీపీలు గత ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి ప్రజలకు ఆశలు కల్పించారని గుర్తు చేశారు. ఒక దశలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వ‌నందుకు నిరసనగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని చెప్పార‌ని ప్ర‌స్తావిస్తూ... అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పార్టీలు మాట మార్చి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడం దుర్మార్గమ‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు.

ప్రత్యేక హోదాను సుజనా చౌదరి చెల్లని నోట్లతో పోల్చడం చూస్తుంటే ఆయన పక్కా వ్యాపారవేత్తగా తేట‌తెల్ల‌మ‌వుతుంద‌ని రామ‌కృష్ణ విమ‌ర్శించారు. వ్యాపార కోణంతో ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టే సుజనా చౌదరి - వెంకయ్యనాయుడులు ప్రజా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రత్యేక హోదా సాధన ప్రజల లక్ష్యమ‌ని పేర్కొంటూ హోదాను చెల్లనినోట్లతో పోల్చిన సుజనా వంటివారు తమ నోటి దురుసుతో ప్రజాస్వామ్యంలో చెల్లకుండా పోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని వెంకయ్యనాయుడు అనడం ఆయన కప్పదాటు వైఖరికి పరాకాష్ట అని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. "రాజపీనుగ ఊరికే పోదు" అన్నట్లు తనతోపాటు చంద్రబాబును కూడా భ్రష్టు పట్టించి - ముంచేసేందుకు వెంకయ్య సిద్ధపడ్డారని జోస్యం చెప్పారు.

ఇదిలాఉండ‌గా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సైతం ఈ ప‌రిణామంపై మండిప‌డ్డారు. ప్రత్యేక హోదాపై ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను కేంద్రమంత్రి సుజనా చౌదరి చెల్లని నోట్లతో పోల్చడం టీడీపీ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ ప్రజల్లోకి వెళ్లని సుజనా చౌదరికి హోదా గురించి ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ఎలా తెలుస్తుందని ర‌ఘువీరా ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన చట్టబద్ధత లేని ప్యాకేజీ కోసం ప్రయత్నించడం టీడీపీ ఆడుతున్న మరో డ్రామా అని విమర్శించారు. హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయకపోగా...చులకన చేయడం తగదన్నారు. చేతనైతే కాంగ్రెస్ చేస్తున్న హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని రఘువీరా హితవు పలికారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/