Begin typing your search above and press return to search.

వెంక‌య్య, బాబు చ‌రిత్ర‌హీనుల‌వుతారు

By:  Tupaki Desk   |   10 Feb 2017 9:10 AM GMT
వెంక‌య్య, బాబు చ‌రిత్ర‌హీనుల‌వుతారు
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశానికి సంబంధించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు - సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర చరిత్రలో మోసగాళ్లుగా మిగిలిపోతారని వామ‌ప‌క్ష నేత‌ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమ‌ర్శించారు. అధికారంలో ఉన్న‌పుడు ఒక‌మాట‌, అధికారంలో లేన‌పుడు మ‌రోమాట మాట్లాడే నాయ‌కులుగా వాళ్లిద్ద‌రి పేరు నిలిచిపోతుంద‌ని ఎద్దేవా చేశారు. సామాజిక హక్కుల సాధ‌న పేరుతో బస్సుయాత్ర చేప‌ట్టిన రామ‌కృష్ణ ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా ప‌లు సభ‌ల్లో ప్ర‌సంగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర - రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల‌ని త‌ద్వారా వెనుక‌బ‌డిన ఈ ప్రాంతాల‌ను అభివృద్ధి చెందించాల‌ని కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలా మోసం చేసిందని, బడ్జెట్‌ లోనూ మెండిచేయి చూపిందని - పోలవరం నిధులు కేటాయించకపోవడం విచారకరమని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. విశాఖ రైల్వే జోన్‌ ఊసే లేదని - కడప స్టీల్‌ ప్లాంట్‌ సంగతి పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో ప‌రిపాల‌న గాడి త‌ప్పింద‌ని, క‌మీష‌న్లు- కాంట్రాక్టులు, న‌చ్చిన వారికి అంద‌లం అనే అజెండాతో సీఎం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నార‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. త‌న కుమారుడు నారా లోకేష్‌ కు మంత్రి పదవి ఇచ్చేందుకు తహతహలాడుతున్న సీఎం చంద్రబాబు, వంద‌లాది మంది సంక్షేమ హాస్టల్ల విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు మాత్రం ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. వియ్యంకులైన‌ పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ - విద్యాశాఖా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు విద్యను వదిలిపెట్టారని రామ‌కృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగిస్తున్నారన్నారు. ద‌ళితులు, గిరిజ‌నులు వైద్యం అంద‌క తీవ్ర అవ‌స్త‌లు ప‌డుతున్నార‌ని వారి విష‌యంలో ఏనాడు చంద్ర‌బాబు స‌మీక్ష చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. కానీ కాంట్రాక్ట‌ర్ల ఇవ్వాల్సిన బిల్లుల్లో జాప్యం ఏమైనా జ‌రుగుతోందా అంటూ మాత్రం సీఎం అధికారుల‌ను అడిగి తెలుసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, బీసీలకు కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతమే ఖర్చు చేశారని రామ‌కృష్ణ పేర్కొన్నారు. ప్ర‌జానికం ఎదుర్కొంటున్న ఇలాంటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకే తాము యాత్ర చేపడుతున్న‌ట్లు రామ‌కృష్ణ వివ‌రించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/