Begin typing your search above and press return to search.

కేంద్రం తాజా ప్ర‌క‌ట‌న మోసం చేయ‌డ‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   15 Dec 2016 5:30 PM GMT
కేంద్రం తాజా ప్ర‌క‌ట‌న మోసం చేయ‌డ‌మేన‌ట‌
X
ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని - ఇంకేమీ బాకీలేమని కేంద్ర ప్రణాళిక శాఖా మంత్రి ఇంద‌ర్ జీత్ సింగ్ లోక్ స‌భలో చెప్పడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ - ఏపీ ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసగించదలిస్తే సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు గడవగానే ఏపీకి అన్నీఇచ్చేసామని, ఇవ్వాల్సిందేమీ లేదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. కాకి లెక్కలతో రాష్ట్రాన్ని మోసగించదలిస్తే మరోమారు పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నాం.

గత ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ 10 ఏళ్ళపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నామ‌ని రామ‌కృష్ణ‌ - చ‌ల‌సాని రామ‌కృష్ణ ప్ర‌స్తావించారు. విభజన బిల్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని - అధికారంలోకి వస్తే 10 ఏళ్ళపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ చెప్పిన వెంకయ్యనాయుడు తదుపరి ప్యాకేజీ పాట పాడి "ప్యాకేజీల సన్మానాలు" కూడా చేయించుకున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 7న అర్ధరాత్రి విలేకరుల సమావేశంలో అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగా... రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన హామీలను కేంద్రం తప్పకుండా అమలుచేయాల్సిందిపోయి కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజలు మరచిపోయారని కేంద్రం అనుకుంటోందనీ, అలా అనుకోవడం కేంద్ర ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. ఏపీకి ఏమీ ఇవ్వనవసరం లేదంటూ కాకి లెక్కలు చెబితే ఉద్యమించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ మాయలను - అంకెల గారడీలను ఇకనైనా గమనించి, రాఫ్రానికి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/