Begin typing your search above and press return to search.

జ్యోతుల నెహ్రూకు వైసీఎల్పీ పగ్గాలు?

By:  Tupaki Desk   |   23 April 2016 6:44 AM GMT
జ్యోతుల నెహ్రూకు వైసీఎల్పీ పగ్గాలు?
X
ఏపీలో రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కానుందా? వైసీపీ అధినేత జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోనున్నారా? ఆయన స్థానంలో జ్యోతుల నెహ్రు వైసీపీఎల్పీ నేత కానున్నారా? అంటే తాజా పరిణామాలు - అంచనాలు అవుననే అంటున్నాయి. వైసీపీలోనూ ఇప్పుడు ఇలాంటి కలవరమే మొదలయింది. ప్రధాన ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్న జగన్‌ ను, ఆ హోదా నుంచి తప్పించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహరచన ప్రారంభించిందని తెలుస్తోంది. ఇటీవల శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

తెలంగాణలో టిడిపి శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్‌ లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పీకర్‌ కు లేఖ రాయడం, ఆయన దానిని ఆమోదించడం తెలిసిందే. అయితే, అది చెల్లదని రేవంత్‌ రెడ్డి ఎంత వాదించినా ఫలితం లేకుండా పోయింది. మెజారిటీ సభ్యులు సంతకాలు చేస్తే వారు ఎంపిక చేసుకున్న నేతను శాసనసభాపక్ష నేతగా గుర్తించే అధికారం స్పీకర్‌ కు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా అదే బాట పట్ట నుంది. వైఎస్ జగన్ శాసనసభాపక్ష నేతగా ఉన్న వైసీపీని చీల్చే ఎత్తుగడలో నిమగ్నమయింది. అందులో భాగంగా, వైఎస్‌ జగన్ స్థానంలో జ్యోతుల నెహ్రును ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ శాసనసభా సమావేశాల నాటికి వైసీపీ నుంచి దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు గోడ దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో తాము జగన్ స్థానంలో జ్యోతుల నెహ్రును శాసనసభాపక్ష నేగా ఎన్నుకుంటామని స్పీకర్‌ కు రాయనున్నట్లు సమాచారం. ఆ ప్రకారంగా సాంకేతికంగా 67మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 34 మంది తమకు జగన్ మీద విశ్వాసం లేదని, కాబట్టి తమ నాయకుడిగా జ్యోతుల నెహ్రును గుర్తించాలని లేఖ రాస్తే, మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని స్పీకర్ ఆమోందించకతప్పదు. అదే జరిగితే జగన్‌ కు అప్పటివరకూ ఉన్న ప్రధాన ప్రతిపక్షనేత హోదా పోతుంది. అప్పుడు ఇప్పడున్నంత బలంగా మాట్లాడే అవకాశం జగన్‌ కు ఉండదు. ఆ తర్వాత తెలంగాణలో దయాకర్‌ రావు మాదిరిగానే వైసీపీ శాసనసభాపక్షాన్ని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలంటూ, జ్యోతుల నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ కు లేఖ రాస్తుంది. దానిని స్పీకర్ సహజంగానే ఆమోదించడం జరుగుతుంది. ఇదే వ్యూహంతో జగన్‌ ను రాజకీయంగా చావుదెబ్బ తీసేందుకు, తెలుగుదేశం పార్టీ సాంకేతిక అస్త్రాలకు పదునుపెడుతోంది.

త్వరలో జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని ఆర్ధిక మంత్రి యనమల - ఆ పార్టీలో చీలికలు వస్తాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు తరచూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక, అసలు మర్మం ఇదేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ శాస నసభాపక్ష నేతగా ఉన్న సమయంలో, తామంతా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్ధిస్తున్నట్లు బాబు నాయకత్వంలోని మెజారిటీ ఎమ్మెల్యేల బృందం, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడుకు లేఖ రాసింది. నిబంధ నల ప్రకారం చంద్రబాబునాయుడుకే మెజారిటీ ఉన్నందున స్పీకర్ బాబు నాయకత్వంలోని టిడిఎల్పీని అసలైన టిడిపిగా గుర్తించడంతో, బాబు ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు వైసీపీని - జగన్ ను అదే అస్త్రంతో దెబ్బ కొట్టడానికి ప్లాను చేస్తున్నట్లు తెలుస్తోంది.