Begin typing your search above and press return to search.

జగన్ పార్టీలో ఉన్నా ఇంట్లో ఎన్టీఆర్ బొమ్మే ఉండేదట

By:  Tupaki Desk   |   12 April 2016 10:09 AM IST
జగన్ పార్టీలో ఉన్నా ఇంట్లో ఎన్టీఆర్ బొమ్మే ఉండేదట
X
అభిమానం వేరే.. అవసరం వేరన్న విషయాన్నిచాలా సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పుకొచ్చారు జ్యోతుల నెహ్రు. అవసరం కోసం చేసే రాజకీయం పైకి ఒకలా కనిపించినా.. గుండెల్లో అభిమానం మాత్రం నాలుగు గోడల మధ్య ఎలా ఉంటుందో ఆయన తాజాగా విప్పి చెప్పారు. మొన్నటి వరకూ ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్యోతుల నెహ్రు.. తాజాగా ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశంలో చేరటం తెలిసిందే.

భారీ ఎత్తున తనను అభిమానించే నేతలు.. కార్యకర్తలు వెంట రాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన పార్టీ మారటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన జ్యోతులు ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ.. తన గుండెల్లో మాత్రం ఎన్టీఆర్ మీద అభిమానం ఉండేదని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా.. తన ఇంట్లో మాత్రం ఎన్టీఆర్ బొమ్మే ఉండేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. జ్యోతుల తాజా మాటలు చూస్తే.. అవసరం కోసం రాజకీయం చేసే నేతల మనసు ఒకరకంగా.. మాటలు మరోలా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించే నేతల తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని జ్యోతుల నెహ్రు ఎంత బాగా చెప్పారో కదా..?