Begin typing your search above and press return to search.

జ్యోతుల దెబ్బ జగన్ కు మామూలుగా పడదా?

By:  Tupaki Desk   |   28 March 2016 6:07 AM GMT
జ్యోతుల దెబ్బ జగన్ కు మామూలుగా పడదా?
X
తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్ కు ఎదురుదెబ్బలు చాలానే తిన్నారు. కానీ.. రాజకీయంగా ఆయనకు ఇప్పుడు ఓ రేంజ్ ఎదురుదెబ్బ తగలటం ఖాయమంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యే చేతిలో ఆయనకు ఎదురయ్యే షాక్ నుంచి కోలుకోవటానికి కొంతకాలం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవటం.. ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరిగి.. పార్టీ మారే విషయంలో ముహుర్తం మాత్రమే మిగిలిన పరిస్థితి.

జగన్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. ఇప్పటివరకూ ఎదరుకాని చిత్రమైన పరిస్థితి ఎదురవుతుందని.. జ్యోతుల నెహ్రు కారణంగా పలు విధాలుగా జగన్ దెబ్బలు తప్పవని చెబుతున్నారు. అదెలానంటే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం జ్యోతుల నెహ్రుతో పాటు మరోనాలుగు సీట్లు గెలుచుకున్నారు. వీటిల్లో జ్యోతుల ప్రభావమే ఎక్కువగా చెబుతారు.

పూర్వాశ్రమంలో టీడీపీ నేతగా ఉండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత జగన్ వెంట నడిచిన జ్యోతుల.. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ విపక్షానికి పరిమితమైనా ఫీల్ కాలేదు. జగన్ కు అండగా ఉంటూ.. బాబును బాగానే టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని జ్యోతులకు ఇవ్వకుండా ఒక జూనియర్ ఎమ్మెల్యేకు ఇస్తూ జగన్ నిర్ణయం తీసుకోవటం ఆయన మనసుకు బాధ కలిగించింది.

ఇదే సమయంలో జ్యోతులకు ఏపీ అధికారపక్షం నుంచి ఆహ్వానం రావటంతో.. ఉన్న పార్టీలో అవమానాలు ఎదుర్కొనే కన్నా.. పిలిచి పదవినిస్తానని చెబుతున్న పార్టీ వెంట వెళ్లేందుకు జ్యోతుల డిసైడ్ అయ్యారు. అయితే.. తాను పార్టీ నుంచి వెళుతున్న వేళ.. తన శక్తి ఏంటో ప్రదర్శించాలన్న భావనలో జ్యోతుల ఉన్నట్లుగా చెబుతున్నారు. తనతోపాటు జిల్లాకు చెందిన నలుగురు జగన్ ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తోడల్లుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేనట్లే అవుతుంది. అది.. జగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అని చెప్పక తప్పదు.