Begin typing your search above and press return to search.

స్వదేశానికి తెలుగమ్మాయి..ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

By:  Tupaki Desk   |   5 March 2020 5:30 PM GMT
స్వదేశానికి తెలుగమ్మాయి..ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
X
చైనాకు కరోనా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చైనా వెళ్లిన అమ్మాయి ఎట్టకేలకు భారత్ కు చేరుకుంది. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్న కర్నూల్ కు చెందిన యువతి జ్యోతి ఉద్యోగ శిక్షణలో భాగంగా చైనాలోని వూహాన్‌ సిటీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయింది. ఇటీవల చైనాకు సహాయం అందించేందుకు వైద్య సామగ్రితో వెళ్లిన భారత యుద్ధ విమానం సహాయం చేసిన అనంతరం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. వారితో పాటే జ్యోతి కూడా భారత్ కు వచ్చింది. అయితే తీసుకొచ్చిన వారందరికీ హర్యానాలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెను కర్నూల్ కు పంపనున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వూహన్ సిటీలో చిక్కుకున్న జ్యోతిని ఎలాగైనా భారత్ కు తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జ్యోతి సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంతో... తల్లిదండ్రులతో పాటు ఆమెకు కాబోయే భర్త ఆనందం వ్యక్తం చేశారు. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్న జ్యోతి జాబ్‌ ట్రైనింగ్‌లో భాగంగా తన టీమ్ తో కలిసి చైనాలోని వూహాన్‌ కు వెళ్లగా ఆ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో తిరుగుపయనమైంది. అయితే ఆమెతో పాటు మరొకరికి జ్వరం లక్షణాలు ఉండడంతో భారత్‌కు వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో ఇన్నాళ్లూ ఆమె అక్కడే ఎదురుచూడాల్సి వచ్చింది. వచ్చే నెలలో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఇన్నాళ్లూ టెన్షన్‌ పడిన కుటుంబ సభ్యులు ఇప్పుడామె రావడంతో కుదుటపడ్డారు. ఆమె తల్లి కూతుర్ని చూసేందుకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. అయితే ఐసోలేషన్‌ సెంటర్‌లో 15రోజుల పర్యవేక్షణ తర్వాతే వైద్యులు.. జ్యోతిని ఇంటికి పంపనున్నారు.