Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి మరో పోలీస్ బాస్?

By:  Tupaki Desk   |   17 July 2016 12:30 PM IST
రాజకీయాల్లోకి మరో పోలీస్ బాస్?
X
పోలీస్ బాస్ లు రాజకీయాలపై మనసు పడుతున్నారు. డీజీపీలుగా - లేదంటే ఆ స్థాయి అధికారులుగా పనిచేసినవారు గతంలోనూ రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఏపీ డీజీపీ జేవీ రాముడు కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్న ఆయన పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. ఇందుకోసం రాముడు చాలాకాలంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. డీజీపీ రాముడు సొంతూరు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింపల్లి. ఆయన సొంతూరు ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ఉంది. రిటైర్ అయిన తర్వాత రాముడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సొంతూరు - ఆ ప్రాంత ప్రజలతో కలిసి మంచిచెడులు అడిగి తెలుసుకుంటున్నారు. అంతా ఓకే అయితే వచ్చే ఎన్నికల్లో జేవీ రాముడు టీడీపీ తరపున ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.

అయితే.. రాముడుకు ఇక్కడ టీడీపీ నుంచే గట్టి పోటీ ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. అయితే వరదాపురం సూరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చంద్రబాబుకు రిపోర్టులు అందినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ధర్మవరం నుంచి తన కుమారుడిని బరిలో దింపేందుకు పరిటాల సునీత కూడా ప్రయత్నిస్తున్నారు. వరాపురం సూరి - పరిటాల సునీత - డీజీపీ రాముడు వీరు ముగ్గురు ఒకేసామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. జేవీ రాముడు రేసులో వస్తాడన్న వార్తలతో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. జేవీ రాముడు టికెట్ అడిగితే చంద్రబాబు కాదనే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. పైగా ధర్మవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే సూరి పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు చంద్రబాబుకు నివేదికలు కూడా వెళ్లాయి. కాబట్టి జేవీ రాముడు ఎంటరైతే ఆయనకు టికెట్ ఖాయమంటున్నారు.

కాగా గత ఎన్నికల్లో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కూడా ఇలాగే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకుముందు టీడీపీ నుంచి మాజీ సీబీఐ చీఫ్ విజయరామారావు గెలిచారు. ఇలా పోలీస్ ఉన్నతాధికారులు రాజకీయాల వైపు అడుగులు వేయడం ఆసక్తి కరమే.