Begin typing your search above and press return to search.

వాడ్నే కాదు.. వాడి తండ్రిని లోపలేయాలి

By:  Tupaki Desk   |   19 April 2016 4:25 PM GMT
వాడ్నే కాదు.. వాడి తండ్రిని లోపలేయాలి
X
ఒకసారి చేస్తే తప్పు. కానీ.. ఒకే తప్పును అదే పనిగా చేయటాన్ని ఏమనాలి? తప్పు చేస్తే ఏం చేయరన్న ధైర్యం.. తండ్రికున్న డబ్బు.. పలుకుబడి ముందు చట్టం తన ఇంటి చుట్టంగా ఫీలైన ఒక బాల నేరస్థుడికి ఎదురుదెబ్బ తగిలింది. దనబలంతో ఇష్టరాజ్యంగా వ్యవహరించే సంపన్నుల బిడ్డల వికృత చేష్టలు కొత్తేం కాదు. ఢిల్లీకి చెందిన ప్లస్ టూ చదివే ఓ బాల నేరస్తుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ కారును నడిపి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు.

ధీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. నిర్లక్ష్యంగా కారును నడిపిన బాల నేరస్థుడికి ఇలాంటి తరహా నేరాలు గతంలోనూ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాల నేరస్థుడిపైనా.. అతడి తండ్రి మీదా కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన సదరు బాలుడికి బెయిల్ లభించటంతో అతను విడుదలయ్యాడు. దీనిపై పలువురు విమర్శలు గుప్పించటం.. ఈ కేసు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో జువైనల్ జస్టిస్ బోర్డ్ బెయిల్ రద్దు చేసింది. దీంతో ఆ బాల నేరస్థుడ్ని జువైనల్ హోంకి తరలించారు.

నిజానికి ఈ ఉదంతంలో మరో ట్విస్ట్ కూడా చోటుచేసుకుంది. తొలుత బాల నేరస్థుడికి బదులుగా తానే యాక్సిడెంట్ చేసినట్లుగా ఒక వ్యక్తి రావటం.. అతను తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా గుర్తించటంతో సదరు వ్యక్తి వెనక్కి తగ్గాడు. కాగా.. ఈ ఎపిసోడ్ కి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాలుడి తండ్రికి బెయిల్ మంజూరు కావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు మీద తప్పుచేస్తున్న పిల్లాడి దుడుకుతనానికి తండ్రి అభయహస్తం కూడా కారణమన్న విషయం అర్థమవుతుంది. ధనబలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇలాంటి పిల్లల మీదనే కాదు.. వారికి అలాంటి భరోసా కలిగేలా వ్యవహరించే తండ్రుల్ని సైతం కఠినంగా శిక్షిస్తే కానీ వ్యవహారాలు సెట్ కావు. మనకున్న న్యాయవ్యవస్థలో ఇలాంటివి సాధ్యమేనా..?