Begin typing your search above and press return to search.

ఎవరీ కనకరాజు..ఎక్కడి వారు?

By:  Tupaki Desk   |   11 April 2020 1:30 PM GMT
ఎవరీ కనకరాజు..ఎక్కడి వారు?
X
ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ ఈసీ)గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ పదవీ కాలం - అర్హతలపై ప్రభుత్వం తెచ్చిన తాజా ఆర్డినెన్స్ తో నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలం ముగిసింది. దీంతో, విజయవాడలో ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ కనగరాజ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అరగంట సేపు గవర్నర్‌ తో భేటీ అయిన కనగరాజ్ పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేసిన కనగరాజ్....వివిధ కమిషన్లలో కూడా సభ్యుడిగా వ్యవహరించారు. విద్య - బాలలు - మహిళలు - వృద్ధుల సంక్షేమ అంశాలపై కనగరాజ్ పలు కీలక తీర్పులు ఇచ్చారు. ముక్కుసూటి మనిషిగా కనగరాజ్ కు మంచి పేరుంది.

1972లో మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన కనగరాజ్...1973లో సేలం బార్ అసోసియేషన్ సభ్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. సీనియర్ సిటిజన్స్ కేసులను సత్వరం పరిష్కరిస్తారన్న పేరు కనగరాజ్ కు ఉంది. దీంతోపాటు, మద్రాస్ హైకోర్టు - మధురై బెంచ్‌ లోనూ పనిచేసిన అనుభవం కనగరాజ్ కు ఉంది. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌ గా కనగరాజ్ వ్యవహరించారు. 2006లో మద్రాస్ హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. 2006 నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌ గా కనగరాజ్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ఏపీ నూతన ఎస్‌ ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ ను ఎస్‌ ఈసీగా ప్రభుత్వం నియమించింది.

కాగా, ఏపీ సీఈసీ నియామకం - పదవీ కాలం - అర్హతలపై ఏపీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ పదవీ బాధ్యతలు నేడు చేపట్టారు. ఇకపై సీఈసీగా రిటైర్డు హైకోర్టు జడ్జినే నియమించాలని కొత్త ఆర్డినెన్స్ రూపొందించారు. ఇక నుంచి సీఈసీ పదవీ కాలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. గరిష్టంగా రెండు సార్లు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ నిర్ణయం ప్రకారం వరుసగా ఆరేళ్ల పాటు ఆ పదవిలో రిటైర్డు హైకోర్టు జడ్జి కొనసాగవచ్చు. తాజా ఆర్డినెన్స్ తో మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసింది. దీంతో, ఆయనను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.