Begin typing your search above and press return to search.

దివంగ‌త జ‌స్టిస్ లోయా కేసుపై సుప్రీం సంచ‌ల‌న ఆదేశాలు

By:  Tupaki Desk   |   16 Jan 2018 10:30 AM GMT
దివంగ‌త జ‌స్టిస్ లోయా కేసుపై సుప్రీం సంచ‌ల‌న ఆదేశాలు
X
సంచ‌ల‌న ఆదేశాల్ని జారీ చేసింది సుప్రీంకోర్టు. సోహ్రాబుద్దీన్ న‌కిలీ ఎన్ కౌంట‌ర్ ను విచారిస్తున్న సీబీఐ న్యాయ‌మూర్తి అనుమానాస్ప‌ద మృతిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ న్యాయ‌మూర్తి మృతిపై ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టంతో పాటు.. ఒక ప్ర‌ముఖుడ్ని త‌ప్పించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం సుప్రీంకోర్టు జ‌రిగిన విచార‌ణ‌లో ఈ కేసును నాలుగు నిమిషాల పాటు విచారించారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్ప‌ద మృతి కేసులో పోలీసులు ఫైల్ చేసిన య‌ధార్థాలు.. ఆధారాలు మొత్తాన్ని జ‌స్టిస్ లోయా మృతిపై సందేహాలు వ్య‌క్తం చేసిన పిటిష‌న్ దార్ల‌కు అందించాల‌ని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

లోయా మ‌రణించిన స‌మ‌యంలో చేసిన వైద్య నివేదిక మొద‌లుకొని అన్ని ప‌త్రాల్ని ఇవ్వాల‌ని చెప్పింది. జ‌స్టిస్ లోయా అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించారంటూ ఇరువురు ప్రైవేటు వ్య‌క్తులు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వారిలో ఒక‌రు జ‌ర్న‌లిస్ట్ బంధురాజ్ శంభాజీ కాగా.. మ‌రొక‌రు రాజ‌కీయ ఉద్య‌మ‌కారుడు తెహ‌సీన్ పూనావాలా.

ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీశ్ సాల్వే వాద‌న‌లు వినిపించారు. అన్ని డాక్యుమెంట్ల‌ను పిటిష‌న్ దార్ల‌కు చూపించేందుకు ఇబ్బంది లేద‌ని.. కానీ.. అందులోని వివ‌రాల్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కూడ‌ద‌న్న కండిష‌న్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఈ కేసు విచార‌ణ‌ను వారం రోజుల‌కు వాయిదా వేశారు. ఇప్ప‌టికే ప‌లు మ‌లుపులు తిరిగిన జ‌స్టిస్ లోయా అనుమానాస్ప‌ద మృతి కేసు.. రానున్న రోజుల్లో మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

ఇది ఇలా జరిగితే మరో పక్కన ..........

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రాతో జరిగిన అనధికారిక సమావేశంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా కంటతడి పెట్టారు. జస్టిస్ లోయా మృతి కేసులో తనను ఆ నలుగురు న్యాయమూర్తులు అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారని, తన సమర్థత, చిత్తశుద్ధిని శంకించారని ఆయన వాపోయారు. సీజేఐపై తిరుగుబాటు చేసిన ఆ నలుగురు జడ్జీలు అరుణ్ మిశ్రా పేరును నేరుగా చెప్పకపోయినా.. ఆయన డీల్ చేసిన జస్టిస్ లోయా మృతి కేసుపై అనుమానాలు వ్యక్తంచేశారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందించారు. సీజేతో భేటీ సంద‌ర్భంగా...`తాను ఎంతో కష్టపడి పని చేస్తున్నానని, తనపై పని భారం కూడా చాలా ఉన్నదని ఈ సందర్భంగా అరుణ్ మిశ్రా అన్నారు. గతంలో ఉన్న సీజేఐలు టీఎస్ ఠాకూర్, జేఎస్ ఖేహార్ కూడా తనకు ఎన్నో క్లిష్టమైన కేసులను అప్పగించారు` అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అరుణ్ మిశ్రా ఏకంగా కంటతడి పెట్టడంతో దీపక్ మిశ్రా వెంటనే ఆయనను తన చాంబర్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న జస్టిస్ చలమేశ్వర్.. అరుణ్ మిశ్రాను ఓదార్చే ప్రయత్నం చేశారు. తాము సుప్రీంకోర్టులో ఉన్న పలు అంశాలను లేవనెత్తామే తప్ప.. ఎవరికీ వ్యతిరేకం కాదని జస్టిస్ మిశ్రాతో చలమేశ్వర్‌ అన్నారు.


మ‌రోవైపు సుప్రీంకోర్టులోని రెండు, మూడు, నాలుగు, ఐదు బెంచ్‌లను లీడ్ చేస్తున్న రెబల్ జడ్జీలు చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్ యథావిధిగా తమ విధుల్లో చేరారు. సుప్రీంకోర్టును నాశనం చేయడానికి కుట్ర జరుగుతున్నదని, ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలని అంతకుముందు కోర్టు నంబర్ 1లో జరిగిన విచారణలో భాగంగా సీజేఐకి చెప్పారు సీనియర్ లాయర్ ఆర్పీ లూథ్రా. అయితే ఈ సందర్భంగా దీపక్ మిశ్రా చిరునవ్వు నవ్వి, సైలెంట్‌గా ఉండిపోయారు.