Begin typing your search above and press return to search.

జ‌డ్జి లోయా హ‌త్య‌కు..సంక్షోభానికి లింకేంటి?

By:  Tupaki Desk   |   13 Jan 2018 5:15 AM GMT
జ‌డ్జి లోయా హ‌త్య‌కు..సంక్షోభానికి లింకేంటి?
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన న‌లుగురు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు.. అందునా చీఫ్ జ‌స్టిస్ త‌ర్వాత ఉన్న అత్యంత సీనియ‌ర్లు ప్రెస్ మీట్ పెట్టి.. సీజే (చీఫ్ జ‌స్టిస్‌) తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న‌కు తామిచ్చిన విన్న‌పం లేఖ‌ను మీడియాకు అందించారు.

సుప్రీం సంక్షోభానికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. మ‌హారాష్ట్రకు చెందిన న్యాయ‌మూర్తి బీహెచ్ లోయా అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా చెప్పాలి. ఒక జ‌డ్జి అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించ‌టం.. ఆ మ‌ర‌ణించిన జ‌డ్జి.. ప్ర‌ధాని మోడీకి స‌న్నిహితుడు.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడైన అమిత్ షా నిందితుడిగా ఉన్న ఒక కేసును విచారిస్తున్న సంద‌ర్భంలో మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం.

అమిత్ షాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. ఆయ‌న‌కు ఏదో ఒక రోజున షాక్ త‌గిలేలా చేస్తుంద‌ని అంచ‌నా వేసే సొహ్రాబుద్దీన్ హ‌త్య కేసును విచారిస్తున్న జ‌డ్జి 2014లో అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించ‌టం సంచ‌ల‌న‌మైంది. ఇది జ‌రిగిన మూడేళ్ల త‌ర్వాత ఇప్పుడు అదే అంశాన్ని లేవ‌నెత్తుతూ సుప్రీంకోర్టు సీనియ‌ర్ జ‌డ్జిలు గ‌ళం విప్ప‌టం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన జ‌డ్జి బీహెచ్ లోయా ఎవ‌రు? ఆయ‌న మ‌ర‌ణం అనుమానాస్ప‌దం ఎందుకైంది? ఆయ‌న మృతిపై వారి కుటుంబ స‌భ్యులు ఏమ‌నుకుంటున్నారు? ఇంత‌కీ సొహ్రాబుద్దీన్ కు అమిత్ షాకు మ‌ధ్యనున్న లింకేంటి? అస‌లు సోహ్రాబుద్దీన్‌ను ఎందుకు చంపేశారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే..

ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని సోహ్రాబుద్దీన్ తో మొద‌లెడితే.. విష‌యం వివ‌రంగా అర్థం కావ‌టంతో పాటు.. అస‌లేం జ‌రిగింద‌న్న క్లారిటీ ఎవ‌రికి వారికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. సొహ్ర‌బుద్దీన్ షేక్‌ అనే వ్య‌క్తిని.. ఆయ‌న స‌తీమ‌ణి కౌస‌ర్ బీ.. వారి స్నేహితుడు తుల‌సీదాస్ ప్ర‌జాప‌తిని గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ 2005 న‌వంబ‌రు మూడున హైద‌రాబాద్ నుంచి సాంగ్లీ వెళుతున్నారు.

బ‌స్సును మ‌ధ్య‌లో ఆపి.. అందులో నుంచి సొహ్ర‌బుద్దీన్ విడిగా దించి తీసుకెళ్లి ఎన్ కౌంట‌ర్ చేసి చంపారు. ఈ హ‌త్య‌ల కేసులో అప్ప‌టి గుజ‌రాత్ హోంమంత్రి అమిత్ షా కీల‌క నిందితుడన్న ఆరోప‌ణ ఉంది. ఈ కేసును మొద‌ట గుజ‌రాత్ లో విచార‌ణ స్టార్ట్ అయినా.. ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో దాన్ని మ‌హారాష్ట్రకు మార్చారు. ఈ కేసుపై మొద‌ట ప‌ని చేసిన జ‌డ్జిని అక‌స్మికంగా బ‌దిలీ చేశారు. ఆయ‌న స్థానంలో వ‌చ్చిన రెండో జ‌డ్జి బీహెచ్ లోయా.

ఈ కేసును ప‌క‌డ్బందీగా విచార‌ణ చేస్తున్నార‌న్న పేరు జ‌స్టిస్ లోయాకు వ‌చ్చింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ అమిత్ షాకు జ‌స్టిస్ లోయా నోటీసులు ఇచ్చారు. వాటిని షా ఎప్పుడూ ఖాత‌రు చేయ‌లేదు. ఏదో కార‌ణం చెప్పి విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. జ‌స్టిస్ లోయా ఒక జ‌డ్జి కూతురు పెళ్లికి హాజ‌రు కావ‌టానికి 2014 డిసెంబ‌రు 1న నాగ్ పూర్ కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ర‌విభ‌వ‌న్ అనే వీఐపీ గెస్ట్ హౌస్ లో బ‌స చేశారు. తెల్ల‌వారుజాము ప్రాంతంలో లోయాకు గుండెపోటు రావ‌టంతో ఆసుప‌త్రికి తీసుకెళుతుండ‌గా చ‌నిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఆయ‌న మ‌ర‌ణం వెనుక మిస్ట‌రీ ఉందంటూ దివంగ‌త జ‌స్టిస్ లోయా సోద‌రి బియానీ.. ఆయ‌న తండ్రి ఆరోపించారు. ఈ ఉదంతంపై విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారం వివాదంగా మారుతున్న వేళ‌.. మ‌ర‌ణించిన లోయా కుమారుడు అనూజ్ మాత్రం త‌న తండ్రి మ‌ర‌ణంలో త‌మ‌కు ఎలాంటి సందేహాలు లేవంటూ బాంబే హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ మంజులా చెల్లూర్‌కు వ్య‌క్తిగ‌తంగా క‌లిసి మ‌రీ విన్న‌వించ‌టం విశేషంగా మారింది. దీని వెనుక తీవ్ర‌మైన ఒత్తిళ్లే కార‌ణ‌మ‌న్న ఆరోప‌ణ ఉంది.

ఇక్క‌డో లోయా అనుమానాస్పద మ‌ర‌ణంపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు లేవ‌నెత్తిన సందేహాలు చూస్తే.. వాటిల్లోని అంశాలు చాలావ‌ర‌కు స‌మంజ‌సంగా ఉండ‌టం క‌నిపించ‌క మాన‌దు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు లేవ‌నెత్తిన వాద‌న‌లు.. చేసిన వ్యాఖ్య‌లు చూస్తే..

+ జ‌స్టిస్ లోయా మ‌ర‌ణానికి వారం ముందు ఆయ‌న‌కో ఆఫ‌ర్ వ‌చ్చింది. సొహ్ర‌బుద్దీన్ కేసులో అమిత్ షాను నిర్దోషిగా ప్ర‌క‌టించి.. క్లీన్ చిట్ ఇస్తే రూ.100 కోట్లు ఇస్తామ‌ని. ఆ ఆఫ‌ర్ చేసింది ఎవ‌రో కాదు అప్ప‌టి బాంబే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మొహిత్ షా.

+ జ‌స్టిస్ లోయాకు గుండె నొప్పి వ‌చ్చిన‌ప్పుడు తామే కార్లో ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని దండే ఆసుప‌త్రికి తీసుకెళ్లామ‌ని.. ఇద్ద‌రు జ‌డ్జిలు జ‌స్టిస్ శ్రీ‌ధ‌ర్ కుల‌క‌ర్ణి.. జ‌స్టిస్ శ్రీ‌రామ్ మోద‌క్ లు చెప్పారు. స్థానిక జ‌డ్జి విజ‌య్ కుమార్ బోర్డే కారును డ్రైవ్ చేసిన‌ట్లు చెప్పినా నిజం కాదన్న‌ది ఆరోప‌ణ‌.

+ జ‌స్టిస్ లోయా బ‌స చేసిన వీవీఐపీ గెస్ట్ హౌస్ ద‌గ్గ‌ర కార్లు ఎందుకు లేవు?

+ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌టానికి ఆరు నిమిషాలు స‌రిపోతాయి అయితే.. 45 నిమిషాలు ఎందుకు ప‌ట్టిన‌ట్లు?

+ జ‌డ్జిలు తాము కారు డ్రైవ్ చేసి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పినా.. లోయాను ఆటోలో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

+ లోయా చ‌నిపోయార‌ని మాకు 5 గంట‌లప్పుడు చెప్పారు. కానీ రిపోర్ట్ లో మాత్రం లోయా చ‌నిపోయింది 6.15 గంట‌ల‌క‌ని చెప్పారు.

+ లోయా బ‌ట్ట‌ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఎందుకు ఉన్నాయి?

+ గుండె నొప్పి వ‌స్తే.. త‌ల మీద ఎవ‌రో మోదిన‌ట్లు ఎందుకు ఉంది? గుండెపోటు వ‌స్తే ర‌క్తం కారుతుందా?

+ చ‌నిపోయిన‌ప్పుడు తాము ఆసుప‌త్రిలోనే ఉన్నామ‌ని.. లోయా మ‌ర‌ణంలో ఎలాంటి మిస్ట‌రీ లేద‌ని ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని ఇద్ద‌రు జ‌డ్జిలు జ‌స్టిస్ భూష‌ణ్ గ‌వాయ్‌.. జ‌స్టిస్ సునీల్ మక్రే మీడియాకు చెప్పినా.. వారు ఆసుప‌త్రిలోనే లేర‌ని వేరే ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

ఇలా జ‌స్టిస్ లోయా అనుమానాస్ప‌ద మ‌ర‌ణం పలు సందేహాలు వెల్లువెత్తేలా చేస్తే.. ఆ మ‌ర‌ణానికి సుప్రీం సంక్షోభానికి లింకేమిట‌న్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర‌మైన అంశం క‌నిపిస్తుంది.

లోయా అనుమానాస్ప‌ద మృతి కేసు మ‌హారాష్ట్రలోని బాంబే హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఆ త‌ర్వాతి రోజు లోయా మ‌ర‌ణంపై సుప్రీంకోర్టు త‌న ముందుకు వ‌చ్చిన పిటిష‌న్ పై వాద‌న‌లు విన‌టం మొద‌లు పెట్టింది. లాయ‌ర్లు అభ్యంత‌రాలు చెప్పినా కేసును సీనియ‌ర్ జ‌డ్జిలు నిర్వ‌హించే నాలుగు కోర్టు కాద‌ని.. ప‌దో కోర్టుకు ఈ కేసును పంప‌టం సీనియ‌ర్ జ‌డ్జిల ఆగ్ర‌హానికి గురైంద‌ని చెబుతున్నారు. జ‌స్టిస్ లోయా కేసు కీల‌కం కావ‌టంతో ఇద్ద‌రు స‌భ్యుల సుప్రీం బెంచ్ దీనిపై విచార‌ణ స్టార్ట్ చేసింది. కేసు చాలా సీరియ‌స్ అని.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను.. ఇత‌ర సంబంధిత డాక్యుమెంట్ల‌ను పంపాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తున్న‌ట్లుగా అరుణ్ మిశ్రా సార‌థ్యంలోని బెంచ్ పేర్కొంది. జ‌న‌వ‌రి 15లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం పంపాల‌ని కోరింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారి స‌మ‌క్షంలో విచారించ‌టం స‌ముచితమ‌ని.. అరుణ్ మిశ్రా సార‌థ్యంలోని బెంచ్ పేర్కొంది. మ‌రోవైపు విచార‌ణ వ‌ద్ద‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది దుష్యంత్ ద‌వే అభ్య‌ర్థించినా బెంచ్ దాన్ని తిర‌స్క‌రించింది. సుప్రీం విచార‌ణ‌.. బాంబే హైకోర్టు విచార‌ణ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని దుష్యంత్ ద‌వే వాద‌న‌. బాంబే హైకోర్టు విచార‌ణ‌లో ఉన్న కేసును సుప్రీం ముందుకు వ‌స్తే.. దాన్ని సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల‌కు ఇవ్వ‌కుండా.. వేరే వారికి కేటాయించ‌టం తాజా సంక్షోభానికి కార‌ణంగా చెబుతున్నారు.