Begin typing your search above and press return to search.

2 నెల‌ల త‌ర్వాత సుప్రీం జ‌డ్జి మాట్లాడ‌తారంట‌!

By:  Tupaki Desk   |   2 April 2018 4:23 AM GMT
2 నెల‌ల త‌ర్వాత సుప్రీం జ‌డ్జి మాట్లాడ‌తారంట‌!
X
దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంలో సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల్లో ఒక‌రు జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌. ముఖం ప‌గిలేలా విమ‌ర్శ‌లు చేయాల‌న్నా.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా ఇటీవ‌ల కాలంలో ప‌లు సంద‌ర్భాల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించిన చ‌ల‌మేశ్వ‌ర్.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు.

రాజ‌కీయాల‌పై ప్ర‌స్తుతం తాను ఏమీ మాట్లాడ‌లేన‌ని చెప్పారు. రాజ‌కీయాల ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి ఆయ‌న ఆదివారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌పై ప్ర‌జెంట్ తానేమీ మాట్లాడ‌న‌ని.. అందుకు మ‌రో 2 నెల‌ల టైం ఉంద‌న్నారు. తాను ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తే ఆనందించే వారు చాలామంది ఉంటార‌న్న ఆయ‌న‌.. ఇందుకు కార‌ణాల్ని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌కుండా న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు.

సీనియ‌ర్ పొలిటీషియ‌న్ డాక్ట‌ర్ య‌ల‌మంచిలి శివాజీ రాసిన పుస్త‌కాన్ని ఆవిష్క‌రించేందుకు ఢిల్లీ నుంచి బెజ‌వాడ‌కు వ‌చ్చిన ఈ సుప్రీంజ‌డ్జి.. రాజ‌కీయాల్లో త‌గ్గుతున్న విలువ‌ల గురించి చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది నాయ‌కులు జైలుకు వెళ్లార‌ని.. ఆ రోజుల్లో అది గొప్ప‌గా ఉండేద‌ని.. ఇప్పుడు రాజ‌కీయాల్లో చేరి ప‌ద‌వులు అనుభ‌వించి జైళ్ల‌కు వెళుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

తొడ‌లు కొట్టేవారు.. మీసాలు తిప్పే వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక దాని రూపం మారిపోయింద‌న్నారు. ఈ త‌ర‌హా రాజ‌కీయ నాయ‌కులు వ‌చ్చాక య‌ల‌మంచ‌లి శివాజీ.. వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు లాంటి వ్య‌క్తుల‌కు అవ‌కాశాలు లేవ‌న్నారు. ఎవ‌రి పేర్ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌న‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టు జ‌డ్జి మాట‌లు రాజ‌కీయ నేత‌ల‌కు చురుకు పుట్టేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ రెండు నెల‌ల గ‌డువు విష‌యానికి వ‌స్తే..ఆయన మ‌రో 2 నెల‌ల్లో రిటైర్ కానున్నారు. సో.. రానున్న రోజుల్లో మాజీ సుప్రీం కోర్టు జ‌డ్జిగా జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ నోటి నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రానున్నాయ‌న్న మాట‌.