Begin typing your search above and press return to search.

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీ...ఏపీ సంగతేంటి?

By:  Tupaki Desk   |   15 Dec 2020 1:10 PM GMT
తెలంగాణ హైకోర్టు సీజే బదిలీ...ఏపీ సంగతేంటి?
X
ఓ వైపు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత మరొకరు హడావిడిగా హస్తినలో పర్యటించడంపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు సీఎంలకు వెంటవెంటనే ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్లు దొరకడం కూడా చర్చనీయాంశమైంది. ఓ వైపు ఈ చర్చ జరుగుతుండగానే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ను సుప్రీం కోకోర్టు కొలీజియం బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. దీంతోపాటు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని కూడా బదిలీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం కలగనున్నట్లు ఢిల్లీ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు జడ్డిగా హిమా కోహ్లీ సేవలందించారు. జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ గత ఏడాది జూన్‌ 23న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ చౌహాన్ పదవిలోకి వచ్చిన ఏడాదిన్నర తిరగకుండానే బదిలీ కావడంపై చర్చ జరుగుతోంది. కాగా, ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అరుణ్ కుమార్ గోస్వామిని నియమించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మధ్య ప్రదేశ్ హైకోర్టు సీజేగా పనిచేసిన మహేశ్వరి...పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు జగన్‌ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, జస్టిస్ జేకే మహేశ్వరి నిర్ణయాలపై జగన్ సర్కార్ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో... హైకోర్టు న్యాయమూర్తులపై వైసీపీ నేతలు సోషల్ మీడియా, మీడియాలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనం రేపాయి. న్యాయమూర్తులపై భారత ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ ఫిర్యాదు కూడా చేయడం, ఆ లేఖను బహిరంగ పరచడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై జస్టిస్ ఏకే మహేశ్వరి గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు సీజేను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ కుట్ర చేస్తున్నారని సీపీఐ అగ్రనేత నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే బదిలీ అంశం చర్చకు రావడం విశేషం. ఒక వేళ జస్టిస్ ఏకే మహేశ్వరి బదిలీ అయితే జగన్ సర్కార్ కు పెద్ద ఊరట లభించినట్టేనన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.