Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు సీజేగా భాద్యతలు చేపట్టిన జస్టిస్ గోస్వామి

By:  Tupaki Desk   |   6 Jan 2021 7:26 AM GMT
ఏపీ హైకోర్టు సీజేగా భాద్యతలు చేపట్టిన జస్టిస్ గోస్వామి
X
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు నిర్వహించారు.. అనంతరం జస్టిస్‌ గోస్వామి హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్ ‌తో కలిసి కేసుల విచారణ చేశారు.

2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఏపీకి బదిలీపై వచ్చారు. అసోంలోని జోర్హాట్‌ లో 1961 మార్చి 11న జన్మించిన జస్టిస్‌ అరూప్‌ గోస్వామి, గౌహతి ప్రభుత్వ లా కాలేజ్‌ నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా తీసుకున్నారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేయించుకున్నారు. గౌహతి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్ ‌గా సేవలు అందించారు. 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి రెండుసార్లు గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.