Begin typing your search above and press return to search.

ఇదే సూటిప్రశ్నను నేతల్ని అడగండి సార్

By:  Tupaki Desk   |   29 Jan 2017 3:37 AM GMT
ఇదే సూటిప్రశ్నను నేతల్ని అడగండి సార్
X
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అది ఫ్రీ.. ఇది ఫ్రీ అని చెప్పే రోజులు పోయాయి. అన్నీ ఫ్రీ అనే రోజులు దాదాపుగా వచ్చేశాయి.కొన్ని రాజకీయ పార్టీల ధోరణి చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ‘‘ఏదైనా సరే ఫ్రీగా ఇచ్చేస్తాం.. అందుకు మీ విలువైన ఓటును వేయండి’’ అంటూ చెప్పేసే రోజులు వచ్చేశాయ్. ఇదిలా ఉంటే.. నేతల్ని.. అవి కావాలి.. ఇవి కావాలని అని ప్రజలు అడుగుతుంటారని.. అలా అడిగే వారంతా మరిన్నికోర్టులు కావాలన్న మాటను ఎప్పుడైనా అడిగారా? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రశ్నిస్తున్నారు.

ఆయన మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ.. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వాటిని విచారించి.. తీర్పులు చెప్పే కోర్టులు సరిపోవటం లేదు. న్యాయం కోసం కోర్టులకు వచ్చే వారికి సమయానికి న్యాయం అందించే పరిస్థితుల్లో కోర్టులు లేవు. ఇప్పటికే ఉన్న కేసుల్ని విచారించి తీర్పులు చెప్పటానికి ఏళ్లకు ఏళ్లు పట్టే పరిస్థితి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పది లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. ఒక్కో కేసు పరిష్కారం కావాలంటే కనీసం ఐదేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్పే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో పది శాతం మందికి మాత్రమే న్యాయ సలహాలు.. న్యాయసేవలు అందుతున్నాయని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి.

ఇలాంటి వేళ.. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల్ని త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు వీలుగా కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ల్యాప్ టాప్ లు.. సెల్ ఫోన్లు కావాలని అడిగే ప్రజలు కోర్టులు కావాలని ఎందుకు అడగరంటూ ప్రశ్నించారు. చలమేశ్వర్ మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.కానీ.. ఈ ప్రశ్నల్ని ప్రజల్నే కాదు.. పార్టీల్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని ప్రకటలు గుప్పించే రాజకీయ పార్టీలు.. తమ ఎన్నికల ప్రణాళికలో.. మరిన్ని కోర్టులని ఏర్పాటు చేస్తామన్న హామీని ఎందుకు ఇవ్వరు? ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయరు? సామాన్యుడికి న్యాయం వెనువెంటనే అందటం రాజకీయ పార్టీలకు ఇష్టం లేదా? లాంటి ప్రశ్నల్ని.. న్యాయనిపుణులు బహిరంగంగా సంధించాల్సిన అవసరంఉంది. అప్పుడే ప్రజల్లో చైతన్యం వచ్చి.. వారు సైతం నాయకుల్ని.. పార్టీల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది.