Begin typing your search above and press return to search.

తండ్రి తీర్పుకు కొడుకు చారిత్ర‌క తీర్పు!

By:  Tupaki Desk   |   28 Sep 2018 2:20 AM GMT
తండ్రి తీర్పుకు కొడుకు చారిత్ర‌క తీర్పు!
X
అపూర్వ ఘ‌ట్టం. అరుదుగా ఆవిష్కృత‌మ‌య్యే ప‌రిణామం. దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఎప్పుడో కానీ ఇలాంటివి చోటు చేసుకోవేమో. ఇంత‌కీ ఏం జ‌రిగింది? అంత అరుదైన ప‌రిణామం ఏమిటి? అన్న విష‌యాల్లోకి వెళితే..

వివాహేత‌ర సంబంధాల‌పై సుప్రీంకోర్టు వెలువ‌రించిన సంచ‌ల‌న తీర్పుపై సాగుతున్న చ‌ర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ‌తంలో ఇదే న్యాయ‌స్థానంలో త‌న తండ్రి ఇచ్చిన తీర్పును.. నేడు ఆయ‌న త‌న‌యుడే నో చెప్పేసి.. తీర్పును మార్చేయ‌టం అత్యంత అరుదుగా సాగేదిగా చెప్ప‌క త‌ప్ప‌దు.
గ‌తంలో వ్య‌క్తిగ‌త గోప‌త్య‌కు సంబంధించిన తీర్పు విష‌యంలోనూ ఇలా జ‌రిగింది. అప్ప‌ట్లోనూ గ‌తంలో త‌న తండ్రి ఇచ్చిన తీర్పును కొడుకు మార్చేయ‌టం.. విరుద్ద‌మైన తీర్పునుఇవ్వ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పాలి. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే.. తండ్రి జ‌స్టిస్ వై.వి.చంద్ర‌చూడ్‌.. ఆయ‌న కుమారుడు జ‌స్టిస్ డి.వై. చంద్రచూడ్ లు త‌మ‌దైన ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శించారు.

మారుతున్న కాలానికి తగ్గ‌ట్లు సెక్ష‌న్ 497ను చ‌ట్ట‌స‌భే స‌వ‌రించాల్సి ఉంటుంద‌ని సీనియ‌ర్ చంద్ర‌చూడ్ అభిప్రాయ ప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 1985లో జ‌స్టిస్ ఆర్ ఎస్ పాఠ‌క్.. జ‌స్టిస్ ఎఎన్ సేన్ ల‌తోక‌లిసి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న వైవీ చంద్ర‌చూడ్ సెక్ష‌న్ 497 మీద తీర్పును ఇచ్చారు.

సౌమిత్రి విష్ణు కేసుగా ప్ర‌సిద్ధి చెందిన ఈ కేసులో సీనియ‌ర్ చంద్ర‌చూడ్ తీర్పు రాస్తూ.. అంద‌రూ అంగీక‌రించే విష‌యం ఏమంటే.. సాధార‌ణంగా పురుషులే వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటారు. మ‌హిళ‌లు కాదు. కాలం మారేకొద్దీ ఈ ప‌రిస్థితుల్లో మార్పు రావొచ్చు. స‌మాజంలో మార్్పులు గ‌మ‌నించి శాస‌న‌వ్య‌వ‌స్థ సెక్ష‌న్ 497కు మార్పులు చేయాల్సి ఉంటుంది. కొట్టివేస్తే మంచిద‌న్న ఉద్దేశంతో ఈ సెక్ష‌న్ ను కొట్టేయొద్దంటూ రాశారు. త‌న తండ్రి తీర్పుకు భిన్న‌మైన తీర్పును ఇచ్చారు జూనియ‌ర్ చంద్ర‌చూడ్‌. సెక్ష‌న్ 497 మీద జ‌రిగిన విచార‌ణ‌పై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ సెక్ష‌న్ ను కొట్టేయాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఆయ‌న సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు.

ఉద్యోగాలు చేసి ఇంటి బాధ్య‌త‌లు చూస్తున్న భార్య‌ల‌ను ఏ ప‌నీ చేయ‌ని భ‌ర్త‌లు కొడుతున్నారు. ఆమె విడాకులు కోరుకుంటే ఆ కేసులు ఏళ్ల త‌ర‌బ‌డి కోర్టుల్లో ఉంటున్నాయి. అలాంటి ఆమె మ‌రో వ్య‌క్తి నుంచి ఓదార్పు.. ప్రేమ కోరుకుంటే దాన్ని నిరాక‌రించొచ్చా? భార్య‌భ‌ర్త‌లు వేర్వురుగా విడిపోయి ఉంటున్న‌ప్పుడు వివాహేత‌ర సంబంధాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్ద‌రిలో ఎవ‌రైనా ఇత‌రుల‌తో సంబంధం పెట్టుకుంటే వారిని సెక్ష‌న్ 497 కిద శిక్షించొచ్చా? పితృస్వామ్య వ్య‌వ‌స్థ నాటి నిబంధ‌న లైంగిక స్వ‌తంత్ర‌త‌ను గౌర‌వించాలి.. వివాహం కార‌ణంగా మ‌హిళ అధీన‌మ‌య్యే ప‌రిస్థితిని ఈ సెక్ష‌న్ క‌ల్పిస్తుందంటూ.. ఆ సెక్ష‌న్ ను కొట్టివేయాల‌ని తీర్పు ఇచ్చారు. ఇలా తండ్రి తీర్పునకు భిన్నంగా కొడుకు ఇవ్వ‌టం అరుదుగా జ‌రుగుతుంది. అలాంటిది తాజాగా చోటు చేసుకుంద‌ని చెప్పాలి.