Begin typing your search above and press return to search.

కేంద్రం ఆదేశాల మేరకే పోలీసులు ఆలా..జేఎన్‌ యూ ఘటనపై కేజ్రీవాల్

By:  Tupaki Desk   |   9 Jan 2020 1:13 PM GMT
కేంద్రం ఆదేశాల మేరకే పోలీసులు ఆలా..జేఎన్‌ యూ ఘటనపై కేజ్రీవాల్
X
ఢిల్లీలోని జేఎన్‌ యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు - విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేజ్రీవాల్‌ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. జనవరి 5న జేఎన్‌ యూలో హింసాత్మక వాతావరణం ఏర్పడినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. జేఎన్‌ యూ ఘటనపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలిపారు.

పై నుంచి ఆదేశాలు వస్తే ఢిల్లీ పోలీసులు మాత్రం ఏం చేయగలరు. జేఎన్‌ యూలో ఎలాంటి హింస జరిగిన, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినా మీరెంలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రమే వారిని ఆదేశించింది. ఒకవేళ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే వారిని సస్పెండ్‌ చేయడమో లేక ఉద్యోగాలు ఊడిపోవడమో జరిగేది అంటూ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

కాగా, జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జనవరి 5న హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌ యూఎస్‌ యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.