Begin typing your search above and press return to search.

నాడు తిట్టిన జూపూడి..నేడు వైసీపీలోకి..కరెక్టేనా?

By:  Tupaki Desk   |   10 Oct 2019 9:15 AM GMT
నాడు తిట్టిన జూపూడి..నేడు వైసీపీలోకి..కరెక్టేనా?
X
బెల్లం చుట్టే ఈగలు సామెత రాజకీయాల్లో అక్షరాల పాటిస్తారు కొందరు నేతలు.. మాజీ మంత్రి - ఉత్తరాంధ్ర నేత అయిన గంటా శ్రీనివాస్ రావు అధికారంలో ఉండే పార్టీలో చేరుతూ మంత్రి పదవులు పొందుతుంటారు. ఈసారి జగన్ మాత్రం ఆ చాన్స్ గంటాకు ఇవ్వలేదు. రాజీనామా చేసే వైసీపీలోకి రావాల్సి ఉండడంతో టీడీపీలోనే ఉంటూ గంటా వెనుకడుగు వేస్తున్నారు.

ఇప్పుడు గంటాను మించి మరో నేత కూడా అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలో చేరుతుంటారు. ఆయనే జూపూడి ప్రభాకర్. జూపూడి మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా మారారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ ఆర్ మరణంతో వైసీపీ స్థాపించిన జగన్ వెంట నడిచారు. తర్వాత 2014లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఏకంగా జూపూడికి ఎస్సీ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో జూపూడి పదవి పోయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ జగన్ పంచన చేరారు. రాజకీయ ఊసరవెల్లుల వలే అధికారం ఎక్కడుంటే జూపూడి అక్కడుంటారని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ - మీమ్స్ మొదలయ్యాయి. టీడీపీలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను - వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఎవరూ మరిచిపోరంటే అతిశయోక్తి కాదు..

వైసీపీని టార్గెట్ చేసి నానా మాటలు అన్న జూపూడీ మాటలను సీఎం జగన్ మరిచిపోయినా.. వైసీపీ పెద్దలు గుర్తుపెట్టుకోలేకపోయినా నెటిజన్లు మాత్రం డేట్ తో సహా గుర్తుపెట్టుకున్నారు. అధికారమే లక్ష్యంగా పార్టీలు మారే జూపూడి వైఖరిని తూర్పార పడుతున్నారు.

వైఎస్ఆర్ సీపీలో టీడీపీ నేత జూపూడి చేరికను వైసీపీ స్వాగతించినా వైసీపీ కింది స్థాయి కార్యకర్తలు - ఆ పార్టీ అభిమానులు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. ‘జూపూడీని వైఎస్ ఆర్సీపీలోకి చేర్చుకోవడం కరెక్టేనా?’ అని తుపాకీ. కామ్ పోల్ పెడితే ఏకంగా 78.59 శాతం మంది తప్పు అని కుండబద్దలు కొట్టడం గమనార్హం. ఇక జూపూడీని వైసీపీలో చేర్చుకోవడం కరెక్టేనని అన్నది కేవలం 12.04 శాతం మంది మాత్రమే. ఇక ఏమో చెప్పలేం అన్నది 9.37 శాతం మంది.

టీడీపీలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ ను ఇదే జూపూడి తీవ్రంగా విమర్శించారు. జగన్ ను సైకో - కాలకేయుడు - విషమని ఆరోపించాడు. ఇక జగన్ ను - వైసీపీని - విజయసాయిరెడ్డిని వివిధ సందర్భాల్లో జూపూడి విమర్శలను డేట్లతో సహా బయటకు తీసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. ఆ విమర్శలు చూస్తే అసలు జూపూడిని పార్టీలోకి చేర్చుకోవడమే పెద్ద తప్పు అంటున్నారు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా.. జూపూడి అవసరం ఏమొచ్చిందో కానీ ఇప్పుడు అధికార పార్టీలో చేరారు. మళ్లీ అధికారం అనుభవించబోతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ నిత్య రాజకీయ అధికారం అనుభవిస్తున్న జూపూడి లాంటి నేతలకు చెక్ పడేది ఎప్పుడోననే చర్చ జరుగుతోంది.

* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జూపూడి వివిధ సందర్భాల్లో జగన్ ను - వైసీపీని తిట్టిన లిస్ట్ పైన చూడొచ్చు...