Begin typing your search above and press return to search.

కారు దిగైనా.. పోటీ చేస్తార‌ట!

By:  Tupaki Desk   |   25 Dec 2021 2:30 AM GMT
కారు దిగైనా.. పోటీ చేస్తార‌ట!
X
టీఆర్ఎస్‌ సీనియ‌ర్ నేత జూప‌ల్లి కృష్ణారావు రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఇప్ప‌టి నుంచే మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్నారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ వ‌చ్చినా రాక‌పోయినా.. బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరినా చేర‌క‌పోయినా.. చివ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానైనా పోటీకి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వాళ్ల‌లో జూప‌ల్లి కూడా ఒక‌రు అనే చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుంద‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఆ ఓట‌మితో..

ఉమ్మ‌డి రాష్ట్రంలో జూప‌ల్లి కృష్ణారావు మంత్రిగా ప‌ని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనూ మంత్రిగా సేవ‌లు అందించారు. కానీ 2018 ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆయ‌న్ని తీవ్రంగా దెబ్బ‌తీసింది.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో చ‌క్రం తిప్పే ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెల‌వ‌గా.. ఆయ‌న ఒక్కరే ఓడిపోవ‌డం జూప‌ల్లిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఆయ‌న‌పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకోవ‌డంతో కొల్లాపూర్‌లో ప‌ట్టు కోసం ఆయ‌న పోరాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ప‌ద‌వి వ‌స్తుంద‌నుకుంటే..

ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కుల లాగా త‌న‌కు కూడా టీఆర్ఎస్ అధిష్ఠానం నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తుంద‌ని జూప‌ల్లి ఆశ‌ప‌డ్డారు. ఎమ్మెల్సీగా చేస్తార‌ని అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. దీంతో టీఆర్ఎస్ నాయ‌క‌త్వం త‌న‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టింద‌నే ఆగ్ర‌హంతో ఉన్న ఆయ‌న ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నార‌ని టాక్‌. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు కాకుండా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కే టీఆర్ఎస్ టికెట్ వ‌స్తే ఏం చేయాల‌నే దానిపై ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర పార్టీల్లో చేరేందుకు ఆయ‌న ప్ర‌యత్నిస్తున్నార‌నే వార్త‌ల వ‌స్తున్నాయి.

బీజేపీలో క‌ష్టం..

రాష్ట్రంలో బ‌లోపేతం అవ‌డంపై దృష్టి పెట్టిన బీజేపీ.. టీఆర్ఎస్ నేత‌ల‌కు స్వాగతం ప‌లికేందుకు సిద్ధంగా ఉంది. కానీ జూప‌ల్లి విష‌యంలో మాత్రం అది జ‌రిగేలా లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే అక్క‌డ డీకే అరుణ బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆమెకు జూప‌ల్లికి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలున్నాయి. అందుకే ఆయ‌న బీజేపీ వైపు చూడ‌డం లేద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని బ‌ట్టి కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచ‌న కూడా చేస్తున్నార‌ని స‌మాచారం. ఒక‌వేళ ఇవ్వ‌నీ కుద‌ర‌క‌పోతే చివ‌ర‌కు త‌న అనుచ‌రులు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సింహం గుర్తుపై ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.