Begin typing your search above and press return to search.

అందరి ముందు కొట్టేస్తే పర్సనల్ అవుతుందా?

By:  Tupaki Desk   |   6 Sep 2015 10:11 AM GMT
అందరి ముందు కొట్టేస్తే పర్సనల్ అవుతుందా?
X
అందరి ముందు లాగి కొడితే అది తప్పు అవుతుందా? రైటు అవుతుందా? అందులోకి కొట్టింది.. కొట్టించుకుంది ఇద్దరూ ఎమ్మెల్యేలు అయితే..? ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆచితూచి మాట్లాడటం ఉంటుంది. కానీ.. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లోకి వచ్చారు.

మహబూబ్ నగర్ జెడ్పీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం.. హద్దులు దాటిన అధికారపార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకోవటం.. ఆ ఘటన కెమేరాల్లో రికార్డు అయిపోవటంతో.. ఈ వ్యవహారం టీవీ చానళ్ల ద్వారా అందరికి తెలిసిపోయింది.

తమ ఎమ్మెల్యేపై జరిగిన భౌతిక దాడిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారపార్టీ నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంలో దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షం నేతలు ఎవరూ మాట్లాడకున్నా.. మంత్రి జూపల్లి కృష్ణారావు పెదవి విప్పారు.

దాడి ఘటనలో ఇద్దరి నేతలదీ తప్పు ఉందని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చోటు చేసుకున్న వివాదం వ్యక్తిగతమని తేల్చేశారు. విపక్ష నేతపై అధికారపక్ష నేత చేయి చేసుకోవటం బాహాటంగా కనిపించినా.. అది వ్యక్తిగతంగా సర్ది చెప్పటానికి చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఏదైనా హింసాత్మక ఘటన చోటు చేసుకున్నప్పుడు.. దాడికి పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పటం మామూలే. అందుకు భిన్నంగా.. జరిగిన గొడవ ఇద్దరి నేతల వ్యక్తిగతంగా చెప్పటం మాత్రం జూపల్లికి మాత్రమే చెల్లుతుందేమో.