Begin typing your search above and press return to search.

దళితబంధు బోగస్.. అమలుకు 30-35 ఏళ్లు.. ఎవరు చెప్పారీ మాట అంటే?

By:  Tupaki Desk   |   5 Jun 2023 8:37 AM GMT
దళితబంధు బోగస్.. అమలుకు 30-35 ఏళ్లు.. ఎవరు చెప్పారీ మాట అంటే?
X
''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న దళితబంధు పెద్ద బోగస్. 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలంటే.. రూ.1.70లక్షల కోట్లు కావాలి. ఏడాదికి రూ.5వేల కోట్ల చొప్పున ఇచ్చినా.. ఆ పథకం అందాలంటే సుమారు 30-35 ఏళ్లు పడుతుంది. ఎందుకీ బోగస్ మాటలు చెప్పాలి? తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్ ఒక మాట చెప్పారు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత.. ఒక ఖురాన్.. ఒక బైబిల్. మరి.. ఆ మేనిఫెస్టోలో మొట్టమొదటిది దళితులకు మూడు ఎకరాల భూమి. డబుల్ బెడ్రూం ఇళ్లు. రైతు రుణమాఫీ.. నిరుద్యోగ భృతి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ రోజుకు వాటిల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. మరి.. ఎటుపోయింది మీ భగవద్గీత? ప్రధాని కావటం కోసం గాలిలో మేడలు కడుతున్నాడు'' అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్ కు ఒకప్పటి విధేయుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.

తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన్ను.. ఈ మధ్యన పార్టీ నుంచి బహిష్కరించటం తెలిసిందే. పార్టీ వేటు పడిన వెంటనే ఆయన స్పందిస్తూ.. పంజరం నుంచి బయటపడిపోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ.. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆయన.. ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తి నెలకొంది. ఇదే విషయాన్ని ఆయన్ను అడిగినప్పుడు మరో పది రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. ఏ పార్టీలోకి వెళతామన్నది జూన్ 15 నాటికి స్పష్టత వస్తుందన్నారు. ఇంతకూ కేసీఆర్ తో ఎందుకు తేడా వచ్చింది? అన్న ప్రశ్నకు బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ది నియంతృత్వమని.. ఎవ్వరినీ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండదన్నారు జూపల్లి. ఆయన పద్దతుల కారణంగా మంత్రలుగా తాము చాలా అగౌరవపడ్డామని.. ఒక మంత్రిగా ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్లినా.. ఫాంహౌస్ గేట్లు తెరవలేదన్నారు. ''ఆ క్రమంలో కళ్లలో నీళ్లు వచ్చాయి. ఒకట్రెండు సందర్భాల్లో ఇలాంటి అనుభవం ఎదురైంది. మంత్రులందరికంటే అతితక్కువ సార్లు ప్రగతి భవన్ వెళ్లింది నేనే. ప్రభుత్వం అంటే 24 గంటలు పని చేస్తుంది. ప్రభుత్వం నిద్ర పోతుందా? సీఎం.. మంత్రులంటే ప్రభుత్వమేనని కేసీఆర్ పదే పదే మాట్లాడతారు.కానీ.. ఆయన మాటలకు.. చేసే దానికి పొంతనే ఉండదు'' అని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు కేసీఆర్ కు ఆర్థికంగా సాయం చేశారట కదా? అన్న మాటలకు జూపల్లి స్పందిస్తూ.. అవన్నీ బోగస్ మాటలని.. తాను అలా చేయలేదన్నారు.
కేసీఆర్ ను ఢీ కొనే బలం మీకుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ధన బలం అంటే తాను అడ్డగోలుగా సంపాదించలేదన్నారు. అన్నిచోట్ల ధనబలం పని చేయదని.. హుజూరాబాద్.. కర్ణాటకలో ఏమైందన్న ఆయన కేసీఆర్ సర్కారు పతనం కావటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.