Begin typing your search above and press return to search.

అలా బురద చల్లితే.. జనం నమ్మరు మంత్రిగారూ!

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:08 AM GMT
అలా బురద చల్లితే.. జనం నమ్మరు మంత్రిగారూ!
X
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులకు ఇప్పుడు తొలి లక్ష్యంగా రేవంత్ రెడ్డి మారిపోయారు. ఆయనకు ప్రజల్లో ఎలాంటి క్రెడిబిలిటీ ఏర్పడకుండా - ఆయన కాంగ్రెసులో చేరడం వల్ల తమకు నష్టం జరగకుండా ప్రచారం చేయడమే ప్రధమ ప్రాధాన్యంగా మారిపోయింది. అందువల్ల రేవంత్ గురించి ఎలాంటి ప్రచారం చేస్తే.. జనంలో ఆయనకు విలువ పెరగకుండా ఉంటుందో.. ఆ మార్గాలను గులాబీ నేతలు వెతుక్కుంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే.. రేవంత్ రెడ్డిని సీమాంధ్ర ఏజంటు అని - తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనే చంద్రబాబునాయుడు కుట్రలో భాగంగా కాంగ్రెస్ లో చేరారని అంటున్నారు.

కొందరు గులాబీ నాయకులకు తెలంగాణ- సీమాంధ్ర ప్రాంతాల మధ్య విద్వేషాగ్నులు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ... పబ్బం గడుపుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. రాష్ట్రం విభజనకు ముందు ఇరు ప్రాంతాల్లో ప్రజల హృదయాల్లో ఉన్న భావోద్వేగాల సంగతి వేరు. అదే రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లు గడచిన తర్వాత వారిలో ఉన్న భావోద్వేగాలు వేరు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా మరో రాష్ట్రం కుట్రలు చేస్తున్నదని, ద్రోహం చేస్తున్నారని చెప్పే ఆరోపణలు తగ్గిపోయాయి. అపోహలు సమసిపోయాయి. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడిన తర్వాత కూడా... రేవంత్ రెడ్డిని సీమాంధ్ర ఏజంటు అంటూ ఆ ప్రాంతానికి తెలంగాణ వ్యతిరేకతను ఆపాదించి, దుమ్మెత్తిపోయడం వల్ల ఉపయోగం ఉండదనే సంగతిని మంత్రి జూపల్లి గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు.

గులాబీ నేతలు తమకు కావలిస్తే.. రేవంత్ తోపాటూ చంద్రబాబును కూడా నిందించేలా తమ విమర్శలను ప్లాన్ చేసుకోవచ్చు. అంతే తప్ప దానికి సీమాంధ్ర ప్రాంత రంగు పులిమితే మాత్రం ఉపయోగం ఉండదని పలువురు అంటున్నారు. ఆ మాటకొస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - సీమాంధ్ర రాష్ట్రలో (ఏపీలో) పర్యటించిన సందర్భాల్లో అక్కడి ప్రజలు ఎంతగా ఆదరించారో... మంత్రి జూపల్లికి కనపడలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతో కేసీఆర్ కూడా చాలా సత్సంబంధాలనే కలిగి ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ చేరికను సీమాంధ్ర ప్రాంతపు కుట్రగా పేర్కొనడం భావ్యం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూడా తెదేపా లాగా నాశనం చేయడానికే రేవంత్ రెడ్డిని చంద్రబాబునాయుడు అక్కడకు స్వయంగా పంపుతున్నారని జూపల్లి అంటున్నారు. అలాంటి విమర్శలు ఎన్నయినా చేసుకోవచ్చు. నిజానికి అలా జరిగినా కూడా అది తెరాసకు లాభం చేయడమే అవుతుంది. అంతే తప్ప... ఇంకా ప్రాంతీయ విద్వేషాగ్నులను రెచ్చగొట్టే మాటలను కట్టిపెడితే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు.