Begin typing your search above and press return to search.

60 కొత్త జిల్లాలకు బాబు రెడీ

By:  Tupaki Desk   |   8 Nov 2016 12:30 PM GMT
60 కొత్త జిల్లాలకు బాబు రెడీ
X
తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ అధికార టీఆర్ ఎస్ పార్టీపై చేసే విమ‌ర్శ‌లు తిరుగుట‌పాలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబుకు త‌గులుతున్నాయి. టీటీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రైతు మ‌హా పాద‌యాత్ర మొద‌లుపెట్టిన సంద‌ర్భంగా టీఆర్ ఎస్ స‌ర్కారుపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రేవంత్ సొంత జిల్లా అయిన మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ కు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీడీపీపై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో రేవంత్‌ పై త‌క్కువ విమ‌ర్శ‌లు చేస్తూ ఏపీ సీఎంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్ర విభజనను టీడీపీ అడుగడుగునా అడ్డుకుందని,ఇపుడు అభివృద్ధి విష‌యంలోనూ అదే ప‌ని చేస్తోంద‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని టీడీపీ తీర్మానం చేస్తే తెలంగాణ టీడీపీ నేతలు నోరు మెదపలేదని విమర్శించారు. విభజన చట్టంలో అన్యాయం జరిగినా మాట్లాడిన పాపానపోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని జూప‌ల్లి తెలిపారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.10 వేల కోట్లు చెల్లించామన్నారు. చివరి పైస వరకు కూడా చెల్లిస్తామని హామీ భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలోలేని అంశాలను కూడా సీఎం నెరవేరుస్తున్నారని ఆయ‌న గుర్తు చేశారు. నూతన స‌చివాలయం నిర్మాణంపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. టీ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి తన దారెటో తేల్చుకోవాలన్నారు. జిల్లాల ఏర్పాటుపై ఆయన తన ద్వంద్వ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణను చూసి చంద్రబాబు ఏపీలో 60 మినీ జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నెరవేరవన్నారు. 20 ఏళ్లపాటు విపక్ష నేతలు రెస్టు తీసుకుంటే మంచిదని హితవు పలికారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల‌పై వారు విరుచుకుప‌డ్డారు. "చంద్రబాబు పాలమూరు లిఫ్ట్ ప్రాజెక్టు కు అడ్డుపడ్డపుడు మీరు పార్టీ కి రాజీనామా చేసి ఉంటె పౌరుషం ఉన్న వాళ్ళు అనుకునే వాళ్లం. ఆనాడు స్పందించ‌లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మీరు పోరు బాట ఎందుకు పట్టలేదు? అపుడు ఇపుడు టీడీపీ నేతలది ఆంధ్రా బాటే. రైతులకు రుణ మాఫీ కింద ఇప్పటికే పది వేల కోట్లు ఇచ్చాము..రెండు వేల కోట్లు చెల్లించబోతున్నాం. మీరు చేయనివి ఎన్నో మేము చేస్తున్నాం. మేనిఫెస్టో లో చెప్పనివి కూడా అమలు చేసి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు ఆత్మహత్య లేఖ ల్లో కాంగ్రెస్ - టీడీపీ నేతలే తమ ఆత్మహత్యలకు భాధ్యులని రాశారు..అపుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ఆ రెండు పార్టీల నేతలు ఇపుడు విద్యార్థుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ది దారుల్లో రైతు కుటుంబాలు లేవా? గుక్కెడు నీళ్ళు ఇవ్వలేని మీరు..ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్. రెండున్నర సంవత్సరాల్లో ఏ ఎన్నిక జరిగినా ఓటమి మీదే..అయినా మీకు కనువిప్పు కలగడం లేదు. మేము ప్రతి మాట ఆధారంతో మాట్లాడుతున్నాం, గాలి మాటలు మాట్లాడుతోంది ప్రతిపక్షాలే. కేసీఆర్ వల్లనే తెలంగాణ కు మేలు జరుగుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. బంగారు తెలంగాణ కు బాటలు పడుతున్నాయి..ప్రజలంతా మా వెంటే ఉన్నారు..ఇక ముందు ఉంటారు" అని ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/