Begin typing your search above and press return to search.

వివాదంలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   25 Dec 2016 6:33 AM GMT
వివాదంలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే
X
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వ‌రుస‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ రోగికి సకాలంలో వైద్యం అందించలేదంటూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌ వీఎస్‌ ఎన్‌ వర్మ జూనియర్‌ డాక్టర్లపై దుర్భాషలాడారు. ఈ క్ర‌మంలో ఓ వైద్యుడి సెల్‌ ఫోన్‌ ను నేలకేసి కొట్టడ‌మే కాకుండా మిగతా డాక్టర్లను యూజ్‌ లెస్‌ ఫెలోస్‌ అని తిట్టారు. ఎమ్మెల్యే గారి బూతుపురాణాన్ని నిరసిస్తూ వైద్యులు అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులన్నీ బహిష్కరించారు. దీంతో ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ప్ర‌భుత్వ వైద్యులు అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది.

ఇక సంఘ‌ట‌న‌లోకి వెళితే...పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కాకినాడ గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే రోగికి సకాలంలో వైద్యం అందించలేదని ఆయ‌న తాలుకు వ్య‌క్తులు ఎమ్మెల్యేకు తెలియ‌జెప్పారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్మ ఆస్పత్రికి చేరుకుని జూనియర్‌ డాకర్లపై విరుచుకుపడ్డారు. ఆస్ప‌త్రిలో సిటీ స్కాన్‌ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందించలేక పోయామని డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లు చెప్పారు. దీనిపై ఆగ్రహంపై వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఒక వైద్యుడి సెల్‌ ఫోన్‌ ను నేలకేసి కొట్టారు. మిగతా డాక్టర్లను యూజ్‌ లెస్‌ ఫెలోస్ అంటూ బూతులు తిట్టారు. ఈ ప‌రిణామంపై మ‌రుస‌టి రోజు స‌మావేశమైన డాక్ట‌ర్లు వైద్యంలో ఎమ్మెల్యే జోక్యం తగదని, తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే వర్మపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. అప్పటివరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/