Begin typing your search above and press return to search.

నిద్ర మత్తులోరైలు దిగిన జూనియర్ ఆర్టిస్టు.. రైలు ఎక్కబోతూ మరణం

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:36 AM GMT
నిద్ర మత్తులోరైలు దిగిన జూనియర్ ఆర్టిస్టు.. రైలు ఎక్కబోతూ మరణం
X
టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మరణం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఆమె మరణంపై పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్నేహితులు హైదరాబాద్ లో ధర్నా నిర్వహించారు. ఇంతకీ జ్యోతిరెడ్డి ఎవరు? ఆమె మరణం అనుమానాస్పదం ఎందుకైంది? ధర్నా చేసినోళ్ల డిమాండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన జ్యోతి (26) జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంటారు. అదే సమయంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఉద్యోగిగా ఉద్యోగం చేస్తుంటారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్లారు. తిరిగి నగరానికి వచ్చేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు. చిత్తూరు నుంచి కడపకు వస్తున్న వెంకట్రాది ఎక్స్ ప్రెస్ లో ఆమె రైల్వే కోడూరులో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కు బయలుదేరారు.

మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల వేళలో ట్రైన్ షాద్ నగర్ కు చేరుకుంది. నిద్ర మత్తులో ఉన్న ఆమె.. మెలుకవ వచ్చి.. తాను దిగాల్సిన కాచిగూడకు ట్రైన్ వచ్చేసిందనుకొని హడావుడిగా ట్రైన్ దిగారని.. అయితే.. తాను దిగింది షాద్ నగర్ స్టేషన్ లో అన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే ఎక్కే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో రైలు నుంచి జారి పడిన ఆమె గాయాలపాలయ్యారు. కదులుతున్న రైలులోకి ఎక్కే ప్రయత్నంలో కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మరణించినట్లుగా వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మలక్ పేటలోని ప్రైవేటు ఆసుపత్రి వద్దకు చేరుకున్న జ్యోతిరెడ్డి స్నేహితులు ధర్నాకు దిగారు. ఆమె మరణంపై తమకు అనుమానాలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. జ్యోతిరెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని.. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఆందోళకారులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూనియర్ ఆర్టిస్టు జ్యోతి రెడ్డి మరణం ఇప్పుడు పలు సందేహాలకు అవకాశం ఇస్తోందని చెబుతున్నారు.