Begin typing your search above and press return to search.

తొలి కరోనా వైరస్‌ ను గుర్తించిన మహిళ గురించి తెలుసుకోండి

By:  Tupaki Desk   |   15 April 2020 5:05 PM GMT
తొలి కరోనా వైరస్‌ ను గుర్తించిన మహిళ గురించి తెలుసుకోండి
X
ప్రపంచాన్ని కకలావికలం చేస్తోంది కరోనా మహమ్మారి. మనుషులకు సోకే తొలి కరోనాను కనిపెట్టింది ఓ మహిళ. ఆమె పేరు జూన్ అల్మీడా. స్కాటిష్ బస్ డ్రైవర్ కూతురు. జూన్ అల్మీడా పదహారేళ్ల వయస్సులో స్కూల్ మానేశారు. ఐనప్పటికీ వైరస్ ఇమేజింగ్ మార్గదర్శకురాలిగా నిలిచారు. కరోనా నేపథ్యంలో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది. కోవిడ్ 19 కొత్త వైరస్. కానీ డాక్టర్ జూన్ ఆల్మిడా 1964లో లండన్‌ లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌ లోని తన ల్యాబ్‌ లో కరోనా రకానికి చెందిన వైరస్‌ ను గుర్తించారు.

ఈమె 1930లో జన్మించారు. గ్లాస్గో నార్త్ ఈస్ట్‌ లోని అలెగ్జాండర్ పార్క్ సమీపంలో పెరిగారు. స్కూల్ చదువులు మధ్యలోనే వదిలివేసినప్పటికీ గ్లాస్గో రాయల్ ఇన్‌ ఫర్మరీలో హిస్టోపాథాలజీ విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్‌ గా ఉద్యోగం సంపాదించారు. కెరీర్‌ లో భాగంగా ఆ తర్వాత లండన్ వచ్చారు. 1954లో వెనిజులాకు చెందిన ఆర్టిస్ట్ అల్మిడాను వివాహం చేసుకున్నారు.

వీరికి ఓ కూతురు ఉంది. నివాసం టోరంటోకు మార్చారు. ఒంటారియో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌ లో చేరారు. యాండీబాడీలను ఉపయోగించే వైరస్‌ ను పెంచడం ద్వారా వైరస్‌ ల్ని మరింత మెరుగ్గా చూడగలిగే ఒక విధానాన్ని అభివృద్ధి చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటన్ దేశం ఆమెను వెనక్కి రప్పించిందట. తిరిగి లండన్ సెయింట్ థామస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్లో చేరారు. ఇటీవల బ్రిటన్ ప్రధానికి కరోనా సోకినప్పుడు ఇదే ఆసుపత్రిలో చికిత్స చేశారు.

సాధారణ జలుబు మీద పరిశోధన సాగిస్తున్న డాక్టర్ డేవిడ్ టిరెల్‌ తో డాక్టర్ అల్మీడా కలిసి పని చేశారు. ఓ పరిశోధన నిమిత్తం వైరస్ నమూనాలను జూన్ అల్మిడాకు పంపించారు టిరెల్. ఈ కణాలు ఇన్‌ ఫ్లుయెన్జా వైరస్ తరహాలో ఉన్నాయని, కానీ మొత్తం అదే పోలికలతో లేవని చెప్పారు. ఆమె గుర్తించిన వైరస్‌కు కరోనా అని పేరు పెట్టారు. అదే మొట్టమొదటి మానవ కరోనా వైరస్.