Begin typing your search above and press return to search.

సర్కారు మాట:ఏపీ లోకల్ స్టేటస్ కావాలంటే..?

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:32 AM GMT
సర్కారు మాట:ఏపీ లోకల్ స్టేటస్ కావాలంటే..?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత కీలకమైన.. అతి ముఖ్యమైన ఒక అంశాన్ని కేక్ కట్ చేసిన నాటి కాంగ్రెస్ సర్కారు అస్సలు పట్టించుకోలేదు. విద్య.. ఉద్యోగాలకు సంబంధించి అతి ముఖ్యమైన స్థానికత విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా విభజన తర్వాత వివిధ నియమకాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.

స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన విధానాన్ని తేల్చి చెప్పనప్పటికి.. ఏపీ సర్కారు మాత్రం తాజా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు.. ఆంధ్రా స్థానికత కోరుకుంటే వారు 2017, జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. లేని పక్షంలో వారికి ఏపీ స్థానికత లభించదని తేల్చేశారు.

విద్యార్థులు.. ఉద్యోగులకు వెనువెంటనే ఇబ్బందులు ఏర్పడకుండా.. వివిధ కోర్సుల్లో ఉన్న వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా తగిన కాలపరిమితి ఇవ్వాలన్న అంశంపై పలు విధాలుగా కసరత్తు చేసి మరీ.. ఏపీ స్థానికతకు కటాప్ ప్రకటించేశారు.

ప్రస్తుతం తాము ప్రకటించిన స్థానికత విషయంలో మరింత సమయం ఇస్తే.. పలు అనర్థాలు వాటిల్లే ప్రమాదం ఉందని అందుకే.. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వీలుగా..రెండున్నరేళ్ల కాలపరిమితిని ముందస్తుగా వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీ మంత్రి వర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పలువురు ఏపీ ప్రజలు తమ ప్రాంతానికి తిరిగి వెళ్లాలా? అక్కర్లేదా? అన్న విషయాన్ని తేల్చుకోవటానికి మరికొంత సమయం చిక్కిందని చెప్పొచ్చు. వివిధ కోర్సులు.. ఉద్యోగాల విషయంలో స్థానికతను ఎలా లెక్కవేయాలన్న అంశంపై హైదరాబాద్ లో నివాసం ఉంటుందన్న పలువురిలో పలు సందేహాలు ఉన్నాయి. తాజాగా ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇలాంటి సందేహాలకు చెక్ పెట్టినట్లుగా ఉందని చెప్పొచ్చు.