Begin typing your search above and press return to search.

తన ఎమ్మెల్యేల్నిజగన్ అలా డీల్ చేస్తారా?

By:  Tupaki Desk   |   2 March 2016 7:37 AM GMT
తన ఎమ్మెల్యేల్నిజగన్ అలా డీల్ చేస్తారా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని జగన్ పార్టీకి చెందిన నేతలు ప్రవాహంలా అధికారపార్టీలోకి చేరిపోతున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో తొమ్మిది మంది సైకిల్ ఎక్కేస్తే.. మరికొందరు పచ్చ కండువా కప్పుకునేందుకు తెగ ఉత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. వెల్లువలా వెళ్లిపోతున్న పార్టీ నేతల్ని నిలువరించేందుకు జగన్ రంగంలోకి దిగారు.

పార్టీకి చెందిన ముఖ్యనేతల్ని జిల్లాల వారీగా పంపుతున్న ఆయన.. జంపింగ్స్ కు అవకాశం ఉన్న వారిని గుర్తించి.. వారిని బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. అయితే.. ఇలా వెళుతున్న ముఖ్యనేతలకు ఎదురువుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గుడ్లు తేలేస్తున్నారట. అధినేత మీద తమలో కొండలా పేరుకుపోయిన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. వారు చెబుతున్న మాటలకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక జగన్ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.

తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతల్ని బుజ్జగించేందుకు జగన్ కు అత్యంత సన్నిహితులు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఎదురైన పరిస్థితి గురించి ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అధినేత తీరును తప్పుపట్టటమే కాదు.. జగన్ వెంట నడుస్తున్నందుకు తమకు జరుగుతున్న నష్టం గురించి వారు చెప్పిన మాటలు కాస్తంత షాకింగ్ గా ఉన్నాయి. మరి ఆ మాటలు చూస్తే..

‘‘పేరుకు అధినేతే కానీ.. పార్టీ ఆఫీసుకు వచ్చి ఆయన్ను కలవాలని కోరితే అపాయింట్ మెంట్ ఇవ్వరు. సర్లే.. ఆయన బిజీగా ఉన్నారని సర్ది చెప్పుకున్నా.. ఎక్కడైనా ఎదురైతే అప్యాయంగా రెండు మాటలు మాట్లాడేది ఉండదు. నమస్కారం పెట్టినా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారమే అయినా.. అలాంటివేమీ మచ్చుకు కూడా కనిపించవు’’

‘‘ఎన్నికలప్పుడు ఇస్తానన్న డబ్బుల లెక్క ఇప్పటికి తేలలేదు. ఆయన్ను నమ్ముకొని విపరీతంగా ఖర్చు చేశా. భారీగా అప్పులు చేశా. ఈ రోజు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. కొన్ని అప్పులు తీర్చటం కోసం ఆస్తులు తాకట్టు పెట్టా. ఇప్పుడు ఆ ఆస్తుల్ని వేలం వేయటానికి బ్యాంకులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. ఎక్కడకు వెళ్లినా పనులు కావటం లేదు’’

‘‘ఓపక్క అధినేత తిరస్కారం.. మరోవైపు ఆర్థిక సమస్యలు.. ఇంకోవైపు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అయోమయంలో ఉన్నప్పుడు పార్టీ మారితే నష్టం ఏంటి? జగన్ ను నమ్ముకున్న దానికి అప్పుల పాలై పోయా. ఇంకా పార్టీలో ఉండమంటారా? మీరే చెప్పండి?’’ అంటూ నాన్ స్టాప్ గా తన ఆవేదనను వ్యక్తం చేసిన సదరు ఎమ్మెల్యేల మాటలతో జగన్ జిగిరీకి నోటెంట మాట రాలేదట. జేబులో నుంచి డబ్బులు ఇచ్చే విషయాన్ని పక్కన పెడితే.. అప్యాయంగా దగ్గరకు తీసుకొని మాట్లాడటానికి నొప్పేంటి జగన్ బాబు? అన్న మాట పలువురి నోటి వెంట వినిపిస్తోంది.