Begin typing your search above and press return to search.

‘మళ్లీ వచ్చేస్తాం’, ‘అక్కర్లేదు మీకో నమస్కారం’!

By:  Tupaki Desk   |   16 March 2018 4:40 PM GMT
‘మళ్లీ వచ్చేస్తాం’, ‘అక్కర్లేదు మీకో నమస్కారం’!
X
ప్రకాశం జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారబోతున్నదా? తెలుగుదేశంలో ప్రాధాన్యం ఉంటుందనే అత్యాశతో.. తమను గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి వెళ్లినందుకు ఇప్పుడు చాలా మంది పశ్చాత్తాప పడుతున్నారు. అవకాశం దొరికితే.. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. దానికి తగినట్లుగా ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు వారిలో భయం మరింత పెరుగుతోంది. తిరిగి జగన్ నీడకు వెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రకాశం జిల్లాలో వైకాపా తరఫున గెలిచిన ఆరుగురిలో నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోయారు. అయితే అక్కడ వారికి అంత సానుకూల పరిస్థితులేమీ లేవు. ముఠా కక్షలతో సతమతం అయిపోతున్నారు. పైగా సీటు దక్కుతుందనే గ్యారంటీ కూడా వారికి కనిపించడం లేదు. దీంతో తిరిగి వైకాపాలోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీమారిన వారిలో అద్దంకి నుంచి గొట్టిపాటి రవి - కందుకూరు రామారావు - యర్రగొండపాలెం డేవిడ్ రాజు - గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి తెదేపాలో చేరారు. వారిలో గొట్టిపాటి రవి తప్ప.. మిగిలిన వారికి తెదేపాలో ఇబ్కందులు తప్పడం లేదని సమాచారం. దీంతో జగన్ వద్దకు రాయబారం పంపినట్లు సమాచారం. జగన్ మాత్రం.. ఫిరాయించి వెళ్లిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రానిచ్చేది లేదని తెగేసి చెప్పినట్లుగా చర్చ నడుస్తోంది.

జగన్ ప్రకాశం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న సమయంలోనే ఆయన పార్టీలోకి వచ్చేయడానికి రాయబారాలు పంపారట... టికెట్ భరోసా లేకపోయినా వచ్చేస్తాం అని.. అన్నట్లుగా తెలుస్తోంది. ఏం రాయబారాలు వచ్చినా సరే.. జగన్ మాత్రం మొండిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకసారి వంచించిన వారిని తిరిగి దరికి రానివ్వకుండా.. జగన్ దృఢవైఖరి.. ఆయనకే లాభం అని పలువురు అంటున్నారు. ఎందుకంటే.. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి ఇదే ధైర్యం ఇస్తుందని పలువురు అంటున్నారు.