Begin typing your search above and press return to search.

టీడీపీ `వీఐపీ` వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ జంపింగ్ ఎమ్మెల్యేనా!

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:00 PM GMT
టీడీపీ `వీఐపీ` వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ జంపింగ్ ఎమ్మెల్యేనా!
X
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు.. నిజంగానే టీడీపీపై ద్వేషంతోనే వైసీపీలోకి వ‌చ్చారా? చంద్ర‌బాబు విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే వైసీపీకి జైకొడుతున్నారా? ఇలా వ‌చ్చిన వారు టీడీపీకి దూరంగానే ఉంటున్నారా? లేక‌.. వైసీపీలోకి వ‌చ్చి కూడా టీడీపీతో తెర‌చాటు స్నేహం కొన‌సాగిస్తున్నారా? తెర‌చాటు మంత‌నాలు సాగిస్తున్నారా? అంటే.. ఔన‌నే వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. త‌మ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు తీర్చుకోవ‌డం, కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం వంటి వాటి కోస‌మే.. కొంద‌రు వైసీపీకి చేరువ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి వ్య‌వ‌హార‌మే ఉదాహ‌ర‌ణగా ఉంద‌ని చెబుతున్నారు.

క‌ర‌ణం బ‌ల‌రాం.. టీడీపీకి వీర విధేయుడు. గ‌డిచిన ముప్పై ఏళ్లుగా ఆయ‌న టీడీపీలో ఉన్నారు. పైగా ఆయ‌న అనుకున్న‌ట్టుగా చంద్ర‌బాబు సైతం చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడికి అద్దంకి టికెట్ ఇవ్వ‌మంటే ఇచ్చారు. ఇక‌, ఎమ్మెల్సీగా ఉంటూనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం చీరాల టికెట్ తెచ్చుకున్నారు. గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత‌గా టీడీపీతో మ‌మేక‌మైన క‌ర‌ణం బ‌ల‌రాం.. కొన్నాళ్ల కింద‌ట వైసీపీలో చేరిపోయారు. తాను స్వ‌యంగా వైసీపీ కండువా క‌ప్పుకోక పోయినా.. త‌న కుమారుడు వెంక‌టేష్‌కు క‌ప్పించారు. అంటే.. మొత్తంగా తండ్రీ కుమారులు ఇద్ద‌రూ కూడా వైసీపీలో చేరిపోయిన‌ట్టే! కానీ, ఇది పైకి క‌నిపించే వ్య‌వ‌హారం.

లోపాయికారీగా వీరిద్ద‌రూ కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం ఏంటంటే.. టీడీపీ అధికారికంగా నిర్వ‌హించే.. అత్యంత కీల‌క‌మైన వాట్సాప్ గ్రూప్‌న‌కు చెందిన కీల‌క విష‌యం ఒక‌టి వెలుగు చూసింది. ఈ గ్రూపులో మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో స‌భ్యులు, చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌ ఉన్నారు. వీరంతా పార్టీ నిర్ణ‌యాలు, కీల‌క ఆదేశాలు, అభిప్రాయాల‌ను ఈ గ్రూపులో పంచుకుంటారు. దీనికి గ్రూప్ అడ్మిన్‌ గా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా ఉన్నారు. నిజానికి ఆయ‌న పార్టీ మారి పోయారు. దీంతో టీడీపీ గ్రూపులో ఉండాల్సిన అవ‌స‌రం లేదు.

కానీ, గ్రూప్‌ అడ్మిన్‌గా బ‌ల‌రాం ఇప్పుడు కూడా ఉండ‌డం అనేక సందేహాలకు తావిస్తోంది. నిజంగా టీడీపీపై ద్వేషంతోనే పార్టీ మారి ఉంటే.. ఇప్ప‌టికీ టీడీపీ గ్రూప్‌లో ఎందుకు ఉన్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీని వెనుక ఏదో కుట్ర ఉంద‌ని కూడా సందేమాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీ తీసుకునే కీల‌క నిర్ణ‌యాల‌ను ఈ గ్రూపు ద్వారా క‌ర‌ణం బ‌ల‌రాం.. టీడీపీ చేర‌వేసే అవ‌కాశం ఉంద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాస్త‌వానికి బ‌ల‌రాం.. గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని ఆప‌రేట్ చేసేది మాత్రం ఆయ‌న కుమారుడు వెంక‌టేషే. టీడీపీ అధినేత కుమారుడు లోకేష్‌..తో వెంక‌టేశ్‌కు సంబంధాలు కొన‌సాగుతున్నాయి.

అదేస‌మ‌యంలో టీడీపీ నాయ‌కుడు, యువనేత‌.. ప‌రిటాల శ్రీరాంతోనూ వెంక‌టేష్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా టీడీపీకి-క‌ర‌ణం వెంక‌టేష్ కు మ‌ధ్య వాట్సాప్ మెసేజ్‌లు కొన‌సాగుతున్నాయ‌నేది ఓ వ‌ర్గం వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే క‌ర‌ణం కుటుంబం కేవ‌లం రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే వైసీపీకి మ‌ద్ద‌తు గా మారింద‌ని, అదేస‌మ‌యంలో వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు.. ఈ పార్టీ వ్యూహాల‌ను ప‌రోక్షంగా టీడీపీకి అందిస్తున్నార‌ని.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం రాజ‌కీయ అవ‌స‌రాలు, కేసులు ఉన్న నేప‌థ్యంలో వాటి నుంచి త‌ప్పించుకునేందుకు క‌ర‌ణం కుటుంబం ఇలా పొలిటిక‌ల్ గేమ్‌కు తెర‌దీసింద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

లోకేష్‌తో క‌ర‌ణం వెంక‌టేష్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో వీరు టీడీపీని శాశ్వ‌తంగా విడిచి పెట్టే ఛాన్సే లేద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌ర‌ణం వెంక‌టేష్ తిరిగి సైకిల్ ఎక్కినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామ‌ల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. క‌ర‌ణం టీడీపీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉండ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.