Begin typing your search above and press return to search.

జంపింగ్స్ ఎక్కడ కూర్చుంటారు బాబు..?

By:  Tupaki Desk   |   5 March 2016 8:05 AM GMT
జంపింగ్స్ ఎక్కడ కూర్చుంటారు బాబు..?
X
మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానున్న సమావేశాలు సెలవులు పోను దాదాపు రెండు వారాల వరకూ సాగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయి. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లుగా చెబుతూ.. సైకిల్ ఎక్కేసిన జగన్ పార్టీకి చెందిన ‘8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన నేపథ్యంలో.. అసెంబ్లీలో వీరు గతంలో కూర్చున్న సీట్లలో కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే.. వీరి సీట్లు అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతల మధ్యలోనే ఉన్నాయి. పార్టీ వదిలేసి.. అధికారపక్షంలోకి చేరిపోయిన తర్వాత వీరికంటూ సీట్లు ప్రత్యేకంగా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో వీరి సీటింగ్ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఏదో ఒకటి చేద్దామన్న మాటతో పాటు.. మీకు ఎక్కడ కూర్చుంటే వెసులుబాటుగా ఉందన్న మాటను అడిగినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు.. అధికారపక్షం నేతలు కూర్చునే వైపు కూర్చుంటారని.. కాకుంటే వెనుక వరుసలో సీట్లు దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు నిన్నటివరకూ జగన్ పార్టీవైపు అధికారపక్షం పట్ల దూకుడుగా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు తాము వదిలేసి వచ్చిన జగన్ పార్టీ నేతలపై ఏ రేంజ్ లో దునుమాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. ఇప్పటివరకూ జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు భిన్నంగా.. హాట్ హాట్ గా సాగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.