Begin typing your search above and press return to search.

హైకోర్టు చేతిలో జడ్జిల సెలవులు

By:  Tupaki Desk   |   30 Jun 2016 6:43 AM GMT
హైకోర్టు చేతిలో జడ్జిల సెలవులు
X
హైకోర్టు విభజన వ్యవహారం.. జడ్జిల నియామకానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ జడ్జిలు తమ సెలవుల్ని హోదాను అనుసరించి తమ తర్వాతి స్థాయి జడ్జిల దగ్గర తీసుకునే వీలుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర జడ్జిలు సామూహిక సెలువులు పెట్టాలని నిర్ణయించటం తెలిసిందే. ఈ వ్యూహాన్ని దెబ్బ తీసేలా హైకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం.. జడ్జిలు ఎవరైనా తమ సెలువులకు అనుమతిని హైకోర్టు నుంచి మాత్రమే పొందాల్సి ఉంటుంది. దీంతో.. గతంలో మాదిరి జడ్జిలు సెలువులు తీసుకునే సౌలభ్యం ఇకపై ఉండదు. హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లా కోర్టు జడ్జిల అధికారాలకు హైకోర్టు కత్తెర వేసినట్లేనని చెప్పక తప్పదు. ఇప్పటికే హైకోర్టు విభజన.. జడ్జిల నియామకానికి సంబంధించి నెలకొన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం రెండు పక్షాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.

జడ్జిల కేటాయింపుల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేయటం.. అలా నిరసనకు దిగిన అంశంపై 11 మంది జడ్జిలను సస్పెన్షన్ వేటు వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ జడ్జిలంతా బుధవారం కూడా మూకుమ్మడిగా సెలువులోనే ఉన్నారు. దాదాపు 200 మంది జడ్జిల వరకూ విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో.. సెలవుల విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.