Begin typing your search above and press return to search.

జడ్జిగారి ‘లో దుస్తులు’ ఉతక్కుంటే నోటీసులా?

By:  Tupaki Desk   |   4 March 2016 5:04 PM GMT
జడ్జిగారి ‘లో దుస్తులు’ ఉతక్కుంటే నోటీసులా?
X
మీరో ఆఫీసులో పని చేస్తున్నారు. మీ బాస్ చడ్డీలు ఉతకమని మిమ్మల్ని ఆదేశిస్తే ఏం చేస్తారు? అసలు అలా ఎందుకు అడుగుతారన్న ప్రశ్న వేయటం ఖాయం. కానీ.. తాజా ఉదంతం వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి. అడిగిందే దరిద్రపు పనికి అయితే.. ఆ పని చేసేందుకు ససేమిరా అని చెప్పటం పెద్ద నేరంగా చిత్రీకరిస్తూ.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపిన ఓ జడ్జిగారి విచిత్రమైన ఉదంతమిది.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన సత్యమంగళం కోర్టులో సబ్ జడ్జిగా వ్యవహరించే సెల్వమ్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే..ఈయనగారి వైఖరిపై ఓ రేంజ్ లో చర్చిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. జడ్జిగారి ఆఫీస్ అసిస్టెంట్ గా వాసంతి అనే మహిళ పని చేస్తోంది. తమ లోదుస్తుల్ని ఉతకాలని జడ్జి.. జడ్జి గారి సతీమణి వాసంతికి ఫర్మానా జారీ చేశారు. ఊహించని ఈ ఆదేశానికి సదరు వాసంతి ససేమిరా అని చెప్పిందట.

అలా ఎలా సమాధానం చెబుతావు.. నువ్వు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డావ్.. వారంలోపు ఈ ఉదంతంపై వివరణ ఇవ్వాలంటూ సదరు జడ్జి నోటీసులు జారీ చేసినట్లుగా ఓ పత్రం సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఈ లేఖలో సదరు జడ్జి సంతకం ఉంది కానీ.. ఎలాంటి ఆపీస్ సీల్ లేదు. అయితే.. ఈ ఉదంతంపై స్పందించిన కొన్ని మీడియా సంస్థలు సదరు వాసంతిని కలిసి.. ఈ ఉదంతం గురించి అడిగినప్పుడు జడ్జిగారి లోదుస్తులు ఉతకాలని చెప్పారని.. తాను కుదరదని చెప్పినందుకు నోటీసులు పంపినట్లుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే ఖండించాల్సిందే. తన దగ్గర పని చేసే ఉద్యోగికి ఒక జడ్జి ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం ఏమాత్రం సరికాదన్న మాట బలంగా వినిపిస్తోంది.