Begin typing your search above and press return to search.

జ‌డ్జి లోయా మృతి కేసు సీరియ‌స్ నెస్ చెప్పిన సుప్రీం

By:  Tupaki Desk   |   23 Jan 2018 5:04 AM GMT
జ‌డ్జి లోయా మృతి కేసు సీరియ‌స్ నెస్ చెప్పిన సుప్రీం
X
మా తండ్రి మ‌ర‌ణంపై ఎలాంటి సందేహాల్లేవ‌ని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి బీహెచ్ లోయా కుమారుడు చెప్పిన‌ప్ప‌టికీ.. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు మాత్రం చాలా సీరియ‌స్ కేసుగా అభివ‌ర్ణించ‌టం గ‌మనార్హం. లోయా మృతిపై సందేహాలు వ్య‌క్తం చేస్తూ కోర్టులో దాఖ‌లు చేసిన అంశాలు చాలా తీవ్ర‌మైన‌వ‌ని.. ఆ ప‌త్రాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తామ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు పేర్కొంది.

లోయా మృతిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను షురూ చేసింది. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టుకు చెందిన నాగ‌పూర్‌.. ముంబై ధ‌ర్మాస‌నాలు విచారిస్తోన్న మ‌రో రెండు పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేసింది. అంతేకాదు.. లోయా మృతిపై ఎలాంటి పిటిష‌న్లు దాఖ‌లైనా వాటిని స్వీక‌రించొద్ద‌ని హైకోర్టుల్ని ఆదేశించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ కోర్టుకు స‌మ‌ర్పించ‌ని అన్ని ప‌త్రాల్ని ఫిబ్ర‌వ‌రి 2 లోపు త‌న ముందు ఉంచాల‌ని కోర్టు టైం ఫిక్స్ చేసింది.

అదే స‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పేరును తెర మీద‌కు తేవ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన కోర్టు.. ఆ ప‌ని చేసిన సీనియ‌ర్ న్యాయ‌వాది దుష్యంత్ ద‌వే తీరును త‌ప్పు ప‌ట్టింది. కిక్కిరిసిన కోర్టు హాల్లో దాదాపు గంట పాటు వాద ప్ర‌తివాదాలు జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంలో అమిత్ షా పేరును తెర మీద‌కు తీసుకొస్తూ దుష్యంత్ ద‌వే వ్యాఖ్య‌లు చేశారు. షాను ర‌క్షించే క్ర‌మంలోనే ఇదంతా (జ‌డ్జి మృతి) జ‌రిగింద‌న్నారు. దీనిపై మ‌హారాష్ట్ర స‌ర్కారు త‌ర‌ఫున హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా.. కోర్టు జోక్యం చేసుకొని.. ఇప్ప‌టివ‌ర‌కైతే జ‌డ్జి లోయా మృతి స‌హ‌జ‌మేన‌ని.. ఇప్పుడే ఈ విధ‌మైన ఆరోప‌ణ‌లు చేయొద్ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ కేసు విచార‌ణ క‌వ‌రేజీ విష‌యంలో కోర్టు అడ్డుకోవ‌చ్చేమోన‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ సందేహం వ్య‌క్తం చేయ‌గా.. సుప్రీం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు స‌రికావ‌ని.. వెంట‌నే కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆదేశించింది. దీంతో.. ఇందిరా జైసింగ్ సారీ చెప్పారు. మీడియాను అడ్డుకునే విష‌యంలో తాను ఒక్క మాట కూడా మాట్లాడ‌క ముందే ఇందిరా జైసింగ్ సందేహం వ్య‌క్తం చేయ‌టాన్ని సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా త‌ప్పు ప‌ట్టారు. ఈ కేసు చాలా తీవ్ర‌మైన‌ద‌ని.. ఈ కార‌ణంతో మీడియా నివేదిక‌ల ఆధారంగా కోర్టు వ్య‌వ‌హ‌రించ‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.