Begin typing your search above and press return to search.

స్టేష‌న్ వ‌ర‌కు చేరిన జూబ్లీహిల్స్ బిల్డింగ్ సొసైటీ వివాదం.. అధ్య‌క్షుడిపై అభియోగం!

By:  Tupaki Desk   |   25 July 2021 12:53 PM GMT
స్టేష‌న్ వ‌ర‌కు చేరిన జూబ్లీహిల్స్ బిల్డింగ్ సొసైటీ వివాదం.. అధ్య‌క్షుడిపై అభియోగం!
X
ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదంగా ఉన్న జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ వ్య‌వ‌హారం.. ఇప్పుడు మ‌రిం త ముదిరింది. సొసైటీ అధ్యక్షుడు ర‌వీంద్ర‌నాథ్ స‌హా సొసైటీ కోశాధికారిపై పోలీసులు కేసు న‌మోదు చేయ డం సంచ‌ల‌నంగా మారింది. జూబ్లీహిల్స్ పోలీసుల క‌థ‌నం మేర‌కు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 78, ఫేజ్-3 ప్లాట్ నెంబ‌రు 254-3ను ఆనుకుని దాదాపు 365 గ‌జాల సొసైటీకి చెందిన ఖాళీ స్థ‌లం ఉంది. అయితే.. గ‌త మార్చిలో సొసైటీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన ర‌వీంద్ర‌నాథ్, కోశాధికారి నాగ‌రాజు ఇద్ద‌రూ క‌లిసి.. ఈ భూమిని ఒక మ‌హిళ‌కు చౌక‌గా విక్ర‌యించార‌నేది అభియోగం.

అంతేకాదు.. సొసైటీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌ర‌ప‌కుండానే.. ర‌వీంద్ర‌నాథ్ స‌ద‌రు స్థ‌లం విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించ‌డంపై సొసైటీ స‌భ్యుడు ఎం సురేష్ బాబు.. జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూమి విలువ రూ.కోట్ల‌లో ఉండ‌గా.. గ‌జం భూమిని కేవ‌లం 45 వేలకు ఓ మ‌హిళ‌కు కేటాయించార‌ని.. ఈ క్ర‌మంలో ఆర్థిక లావాదేవీలు చోటు చేసుకున్నాయ‌నేది ఆయ‌న చేసిన ఫిర్యాదులో కీల‌క అంశంగా మారింది. అంతేకాదు, ఈ క్ర‌మంలో సొసైటీకి దాదాపు 5 కోట్ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని ఫిర్యాదిదారుడు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు.. ర‌వీంద్ర‌నాథ్ స‌హా.. కోశాధికారి నాగ‌రాజుపై కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే, ఈ విష‌యంలో మ‌రో వివాదం తెరపైకి వచ్చింది. సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఉన్న స్థ‌లం త‌మ‌దేన‌ని.. ఇది కబ్జాకు గురైదని.. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. సదరు స్థలం జీహెచ్ఎంసికి సంబంధించిందని పేర్కొంటూ.. అందులో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో ఒక్క‌సారిగా సొసైటీ వ్య‌వ‌హారం మ‌ళ్లీ వివాదాల దిశ‌గా అడుగులు వేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.