Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది?

By:  Tupaki Desk   |   8 Jan 2023 12:30 PM GMT
జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది?
X
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టముండని వారుండరు. స్వర్గీయ ఎన్టీఆర్ పోలికలతో ఉన్న ఆయనను నందమూరి అభిమానులంతా ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ జూనియర్ మాత్రం తనకు రాజకీయాలు ఇష్టం లేదని పలు సార్లు చెప్పారు. కానీ గతంలో టీడీపీ తరుపున ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. ఇదిలా ఉండగా ఈనెల 10న జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెడుతారా..? అన్న చర్చ సాగుతోంది.

రాబోయే నెలల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎన్నికల పండుగ సాగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే ఏపీలో 2019లో ఓడిపోయిన తరువాత మళ్లీ అధికారంలోకి రావడానికి ఎప్పటి నుంచో శత విధాల ప్రయత్నిస్తోంది. ఈ మధ్య చంద్రబాబు రోడ్ షోల పేరిట ప్రజల్లో తిరుగుతున్నారు. మరోవైపు జనసేన లాంటి నేతలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీ మరోసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు రాజకీయాల్లో తలమునకలయ్యారు.

ఇదే సమయంలో ఎప్పటి నుంచో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. అయితే 2009లో టీడీపీ తరుపున జూనియర్ ప్రచారం చేశారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఎన్టీఆర్ ప్రభావం ఏమాత్రం లేదని టీడీపీ నాయకుల్లో చర్చ సాగింది. మరోవైపు లోకేశ్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వడం లేదన్న వాదన కూడా వినిపించింది. ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఓట్లు లేదన్న ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తనకు ఇవే చివరి ఎన్నికలని బాబు సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం టీడీపీపై పలు అస్త్రాలను ఎక్కు పెట్టింది. ఆ పార్టీ నిర్వహించే రోడ్ షోలకు అనుమతి లేదని కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించనున్నారు. ఆయనతో ప్రచారం చేయించాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ తో 10వ తేదీన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. కారణాలేవైనా రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ మరోసారి రాజకీయ కండువా కప్పుకుంటాడా..? అనే చర్చ సాగింది. అయితే ఆ తరువాత ఆ విషయం కనుమరుగైంది. ఇప్పుడు టీడీపీతో భేటీ ఉంటుందని తెలియడంతో జూనియర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అని అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలియడం లేదు. నిజంగానే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా..? లేక ప్రచారం వరకే పరిమితం అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.