Begin typing your search above and press return to search.

ఆ పారిశ్రామిక‌వేత్తది ఆత్మ‌హ‌త్యే!

By:  Tupaki Desk   |   30 April 2020 10:30 AM GMT
ఆ పారిశ్రామిక‌వేత్తది ఆత్మ‌హ‌త్యే!
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలోనే ఏప్రిల్‌లో ఓ వ్యాపార‌వేత్త ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో వ్యాపార వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ ఎన్నారై వ్యాపార‌వేత్త జాయ్ అరక్కల్ (54) దుబాయ్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై అక్క‌డి పోలీసులు విచార‌ణ చేశారు. కేసు నమోదు చేసుకున్న అనంత‌రం పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయగా ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని తేలింది.

భారత్‌లోని కేరళ రాష్ట్రం కోజీకోడ్‌ జిల్లా మనంతవడి అరక్కల్ సొంత ప్రాంతం. కేర‌ళ నుంచి ఏళ్ల కింద‌ట‌ దుబాయ్‌కు వెళ్లి అక్క‌డే స్థిరపడ్డారు. చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన ఆయన కొద్దికాలంలోనే పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. దుబాయ్‌లో పేరు మోసిన వ్యాపార‌వేత్త‌గా గుర్తింపు పొందారు. భార‌తీయుల్లో ఎక్కువగా కేర‌ళ ప్ర‌జ‌లు దుబాయ్‌లో స్థిర‌ప‌డ‌తారు. అందులో భాగంగానే అర‌క్క‌ల్ కూడా అక్క‌డికి వెళ్లి బాగానే సంపాదించారు. అయితే ఏమైందో ఏమోగానీ అక‌స్మాత్తుగా ఏప్రిల్ 23వ తేదీన మృతిచెందారు. ఆయన నివసిస్తున్న 14 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు.

మొదట అత‌డి మృతిని అనుమానాస్పదంగా పోలీసులు భావించారు. కేసు విచార‌ణ‌లో దుబాయ్‌ పోలీసులు వారంపాటు విచారణ చేశారు. చివ‌ర‌కు ఆత్మహత్యగా నిర్ధారించారు. అర‌క్క‌ల్ ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని ప్ర‌క‌టించారు. అత‌డి మృతదేహాన్ని యూఏఈ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా స్వ‌దేశానికి తీసుకొచ్చి స్వ‌స్థ‌ల‌మైన మనంతవడిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.