Begin typing your search above and press return to search.

పత్రికలు.. ప్రక్షాళన.. మనుగడ సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 6:13 AM GMT
పత్రికలు.. ప్రక్షాళన.. మనుగడ సాధ్యమేనా?
X
స్మార్ట్ ఫోన్లు రాకమునుపు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్లు ఉండేవి. తర్వాత ఎస్టీడీ - ఐఎస్టీడీ బూత్ లు వచ్చాక అబ్బో అని సంబరపడ్డం. స్మార్ట్ ఫోన్ రాకతో విప్లవమే వచ్చిపడింది. ఇప్పుడు పాత ల్యాండ్ ఫోన్లు - ఎస్టీడీ - ఐఎస్డీ బూతులన్నీ బంద్ అయిపోయాయి.

చిన్నప్పుడు దూరదర్శన్ లో సినిమాలు, క్రికెట్ వస్తుందంటే అబ్బురపడి చూసేవాళ్లం. కరెంట్ పోతే అరె మళ్లీ చూడలేమని బాధపడేవాళ్లం. కానీ నేడు ఇంటర్నెట్ లో స్మార్ట్ ఫోన్ లో ఎక్కడున్నా లైవ్ లో ప్రోగ్రాంలు చూస్తున్నాం..

ఆధునిక సాంకేతికతలో పాతవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పత్రికలకు చేటుతెస్తుందన్న వాదన వినిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవ్వరూ దినపత్రికలను చూసే పరిస్థితి కనిపించడం లేదు. న్యూస్ యాప్ ల ద్వారా అంతా వితిన్ స్పాట్ లో జరిగిన సంఘటనను మరుక్షణమే తెలుసుకుంటున్నారు. తెల్లవారి వచ్చే పత్రికల కోసం ఎదురుచూడడం లేదు.

ఇప్పటికే విదేశాల్లో పత్రికల సర్య్కూలేషన్, వినియోగం తగ్గిపోయి దిగ్గజ పత్రికలు కూడా మూతపడుతున్నాయి. ఇక దేశంలో మోడీ సర్కారు ఇటీవల పెంచిన న్యూస్ ప్రింట్ సుంకంతో పత్రికలన్నీ ప్రక్షాళన బాటపట్టాయి. న్యూస్ ప్రింట్ భారమైపోయి పత్రికల సైజును తగ్గించేస్తున్నాయి. తాజాగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తమ జిల్లా సంచికలను 20 పేజీల నుంచి 12, 16 పేజీలకు తగ్గించేశాయి. పేపర్లు తగ్గిపోయాయి. నెక్ట్స్ మ్యాన్ పవర్ ను తగ్గించడం ఖాయం. దీంతో ఉద్యోగ భద్రత ఉంటుందా ఊడుతుందా అన్న భయం జర్నలిస్టులను వెంటాడుతోంది.

అయితే పత్రికలు కూడా రూటు మార్చుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పత్రికల స్థానంలో డిజిటల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నాయి. తమ డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లను మరింత ఆకర్షణీయంగా మలిచి వీక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. రాను రాను పత్రికలు మూతపడి ఈ ఆన్ లైన్ పత్రికలు, న్యూస్ యాప్ లే మనుగడ సాగించే అవకాశాలు లేకపోలేదు.

అయితే ఎవ్వరూ ఏమీ అన్నా ఇప్పటికీ వార్తల విషయంలో యాప్స్, టీవీ, ఇంటర్నెట్ లో కంటే పత్రికల్లోని వార్తలు చూసేవారు లేకపోలేదు. సవివర కథనాలు కావాలంటే అవి పత్రికల్లోనే లభ్యమవుతాయి. అయితే ఇప్పటి బిజీ లైఫ్ లో పత్రికలు చదివే సమయమే మిగలడం లేదు. అందుకే మన వెంటే అన్ని చోట్ల ఉండే సార్మ్ ఫోన్లలోనే వార్తలు చూసేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో ఐదారు సంవత్సరాల తర్వాత పత్రికల్లో ఇంకా ఎలాంటి ప్రక్షాళనలు వస్తాయి. వాటి మనుగడ సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. సో వెయిట్ అండ్ సీ.