Begin typing your search above and press return to search.

28 నెలలు జైలులో మగ్గిన జర్నలిస్టు.. ఎట్టకేలకు బెయిల్

By:  Tupaki Desk   |   2 Feb 2023 5:32 PM GMT
28 నెలలు జైలులో మగ్గిన జర్నలిస్టు.. ఎట్టకేలకు బెయిల్
X
అతడో జర్నలిస్టు.. కానీ, కాదంటుంది ప్రభుత్వం.. చట్టవిరుద్ధం కార్యకలాపాల కింద ఆయన్ను అరెస్టు చేసింది.. జైల్లో వేసింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 నెలలు జైల్లో ఉంచింది. హక్కుల సంఘాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ఫలితం.. అతడి రెండేళ్ల పైగా విలువైన జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఇదంతా ఎక్కడో జరిగిన ఘటన కవరేజీకి వెళ్తున్న ఓ జర్నలిస్టుకు ఎదురైన అనుభవం. ఎక్కడ కేరళ.. ఎక్కడ యూపీ? సిద్దిఖ్ కప్పన్ కేరళకు చెందినవాడు. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మళయాళం న్యూస్ పోర్టల్ "అజిముఖమ్"లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లో 2020లో సెప్టెంబరు 24న ఓ సంచలన ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని హాథ్రాస్ లో దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేయడం వివాదాస్పదంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ఆమెకు అంత్యక్రియలు చేశారని, కడసారి చూపు కూడా దక్కలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనపై కవర్‌ చేసేందుకు వెళుతూండగా సిద్దిఖ కప్పన్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశోధనాత్మక కథనాన్ని కవర్‌ చేసేందుకు సిద్దీఖీ కప్పన్‌ తన బృందంతో కలిసి హాథ్రస్ బయల్దేరగా.. మార్గమధ్యంలో యూపీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు.

హింసను రేపేందుకు వెళ్తున్నారంటూ.. దళిత యువతి మరణంపై హింసను ప్రేరేపించడానికే వెళ్తున్నారంటూ.. సిద్దిఖీ టీమ్ పై పోలీసులు అభియోగాలు మోపారు. దీంతోపాటు అతడికి నిషిద్ధ ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలున్నట్లు పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కింది న్యాయస్థానాల్లో కప్పన్ కు బెయిల్‌ దొరకలేదు. దీంతో కప్పన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. గతేడాది సెప్టెంబరులోనే అతడికి సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

ఈడీ కేసు పెట్టి.. కప్పన్ ను లక్నో జైలులో ఉంచారు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబరులోనే అతడు బయటకు రావాల్సి ఉంది. కానీ, ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ చలామణీ కేసు పెట్టింది. దీంతో మరికొంత జైలులోనే ఉన్నారు. గురువారం ఎట్టకేలకు బయటకు వచ్చారు. బెయిల్‌ షరతుల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువైన రెండు పూచీకత్తులను ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దీంతో లఖ్‌నవూ జిల్లా జైలు నుంచి కప్పన్‌ గురువారం ఉదయం విడుదలయ్యారు. దాదాపు 28 నెలల తర్వాత అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.