Begin typing your search above and press return to search.

లాలూకు జైల్లో పెళ్లి ప్ర‌పోజ్ చేసిన ట్రాన్స్‌ జెండ‌ర్‌

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:12 AM GMT
లాలూకు జైల్లో పెళ్లి ప్ర‌పోజ్ చేసిన ట్రాన్స్‌ జెండ‌ర్‌
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దాణా కుంభ‌కోణం కేసులో తుది తీర్పు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. దాణా కుంభకోణానికి సంబంధించిన రెండో కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్ష - రూ.10 లక్షల జరిమానా పడింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్‌సింగ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మేరకు శిక్షలు ప్రకటించారు. కాగా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ ను బీహార్ సీఎం పదవికి దూరం చేసిన దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. పశువులకు దాణా - ఔషధాల సరఫరా పేరుతో అధికారులు తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు స్వాహా చేసినందునే దీనికి పశుదాణా కుంభకోణం అనే పేరు వచ్చింది. ఈ కుంభకోణంలో సుమారు రూ.950 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు రాగా 61 కేసులు నమోదయ్యాయి. రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ కేసుపై 1996లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు.. దీన్ని సీబీఐకి అప్పగించాలని పాట్నా హైకోర్టును ఆదేశించింది.

లాలూప్రసాద్‌ను గత నెల 23న దోషిగా ప్రకటించిన తరువాత ఆయనను బిర్సాముండా సెంట్రల్ జైల్లో ఉంచారు. శిక్షల ప్రకటన శనివారం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు లాలూ.. తీర్పునిచ్చిన సీబీఐ కోర్టు జడ్జి శివపాల్‌ సింగ్ మధ్య కొన్ని సరదా సంభాషణలు జరిగాయి. తనను దోషిగా నిర్ణయించారన్న కోపంతో కావచ్చు లాలూ కాస్త నిరసన స్వరంతోనే జడ్జితో మాట్లాడారు. జైల్లో తనకు ఎదురవుతున్న సమస్యల గురించి ప్రస్తావించారు. స్వతహాగా హాస్యప్రియంగా మాట్లాడే లాలూకు జడ్జి శివపాల్‌ సింగ్ కూడా అదే తీరున టక్కున జవాబులిచ్చారు. అటువంటి సంభాషణలు కొన్ని...

లాలూ: జడ్జి సాబ్...జైలులో చాలా చలిగా ఉంది.

జడ్జి: చలిగా ఉంటే హార్మోనియం - తబలా వాయించండి.. వేడెక్కుతారు!

లాలూ: ఈ జైలులో ఒక ట్రాన్స్‌ జెండర్ (లింగమార్పిడి వ్యక్తి) ఉన్నాడు. అతడు తనను పెళ్ల‌ చేసుకోమని ఇతర ఖైదీలను అడుగుతున్నాడు.

జడ్జి: తమరు అక్కడే ఉన్నారు కదా.. అంతా పరిష్కారమవుతుంది లెండి!!
(ఈ కేసులో తనకు ఎన్నేళ్ల‌ జైలు శిక్ష పడుతుందోనని ఆందోళనతో ఉన్న లాలూ.. జడ్జిని ఒక కోరిక కోరారు. ఆ సంభాషణ ఇలా ఉంది.)

లాలూ: దయచేసి కూల్‌ మైండ్‌ తో (ప్రశాంతంగా) శిక్షలు ప్రకటించండి.

జడ్జి: మీ శ్రేయోభిలాషుల నుంచి ఫోన్ల ద్వారా నాకు ఇటువంటి వినతులు వచ్చాయి. అయినా ఆందోళన చెందకండి.. నేను చట్టాన్నే అనుసరిస్తాను.

శనివారం శిక్షలు ప్రకటించాక జడ్జి సింగ్ వెలిబుచ్చిన అభిప్రాయం: ఈ కేసులో దోషులను ఓపెన్ జైలులో ఉంచడమే ఉత్తమం. ఎందుకంటే వారికి పశువుల పెంపకంలో అనుభవం ఉంది!!!