Begin typing your search above and press return to search.

సీఎంను ‘నడిచి వస్తున్న దైవ స్వరూపం’ అన్నదెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

By:  Tupaki Desk   |   31 Dec 2020 3:38 AM GMT
సీఎంను ‘నడిచి వస్తున్న దైవ స్వరూపం’ అన్నదెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
X
తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళలో.. అధినేతను విపరీతంగా పొగిడేసే కార్యక్రమాన్ని పార్టీ నేతలు తీసుకోవటం తెలిసిందే. తరచూ విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తే ఇలాంటి తీరుతోనే.. వాస్తవాలు కీలక నేతల వరకు వెళ్లకపోవటం తెలిసిందే. అధినేత మనసు దోచుకునే కార్యక్రమాన్ని పార్టీకి చెందిన పెద్దా.. చిన్నా అన్న తేడా లేకుండా నేతలంతా చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి కీలక అధికారులు చేరటం సంచలనంగా మారింది.

ఏపీ సర్కారు తాజాగా ఇళ్ల పట్టాల్ని నిరుపేదలకు అందించే భారీ కార్యక్రమానికి తెర తీయటమే కాదు.. గడిచిన ఐదారు రోజులుగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల తమకు ఇళ్ల పట్టాలు అందలేన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదిలా ఉంటే.. బుధవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వేదిక మీదకు ఆహ్వానం పలికే సందర్భంగా జాయింట్ కలెక్టర్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు విభ్రాంతికి గురయ్యేలా మారాయి. ఒక సీనియర్ అధికారి.. జిల్లాకు ముఖ్యులైన సదరు అధికారి సీఎంను ఉద్దేశించి.. మరీ అంత భక్తిభావంతో పిలవటం ఎబ్బెట్టుగా మారింది. సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అదిగో నడిచి వస్తున్న దైవ స్వరూపం’ అంటూ కీర్తించిన వైనం నోరెళ్ల బెట్టేలా చేసింది.

రాజకీయాల్లోనూ.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని అభిమానిస్తూ వారిని ఆరాధనా పూర్వకంగా వ్యాఖ్యలు చేయటం మామూలే అయినా.. అత్యున్నత స్థాయిలో ఉన్న జేసీ లాంటి అధికారి ఈ తరహాలో కీర్తించటం హాట్ టాపిక్ గా మారింది. బాగా పాలిస్తున్నప్పుడు.. సమర్థుడన్న పొగడ్త సరిపోతుంది. అందుకు భిన్నంగా దైవ స్వరూపమని నేరుగా కీర్తించటం మాత్రం రోటీన్ కు భిన్నమని చెప్పాలి. ఈ తరహా పొగడ్తలకు సీఎం జగన్ స్వయంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం చేస్తారో చూడాలి.