Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను చంపేస్తానని చెప్పి బుక్క‌యిన హీరో

By:  Tupaki Desk   |   23 Jun 2017 12:49 PM GMT
ట్రంప్‌ ను చంపేస్తానని చెప్పి బుక్క‌యిన హీరో
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి స‌ర‌దాగా చేసిన వ్యాఖ్య‌ల ఫ‌లితం ఎలా ఉంటుందో హాలీవుడ్ న‌టుడు జానీ డెప్‌కు అర్థం అయిన‌ట్లుంది. జానీ స‌ర‌దాగా చేసిన కామెంట్స్‌.. ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను చంపాల్సిన టైమ్ ఇప్పుడు వ‌చ్చింద‌ని జానీ డెప్ ఓ ప్రోగ్రామ్‌ లో అన్నాడు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర వివాదం రేగింది.

బ్రిట‌న్‌లోని గ్లాస్ట‌న్‌ బ‌రీ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ లో జానీ డెప్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చ‌ర్చ వ‌చ్చింది. ``మామూలుగా అడుగుతున్నాను...ఓ న‌టుడు అధ్య‌క్షుడిని హ‌త్య చేయ‌క ఎన్ని రోజుల‌వుతోంది?`` అని డెప్ అక్క‌డి ఆడియెన్స్‌ను ప్ర‌శ్నించాడు. 1865లో అప్ప‌టి అధ్య‌క్షుడు అబ్ర‌హం లింక‌న్‌ ను జాన్ విల్కిస్ బూత్ అనే న‌టుడు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను ఉద్దేశించి డెప్ ఈ ప్ర‌శ్న వేశాడు. ఆ త‌ర్వాత తాను న‌టున్ని కాద‌ని, బ‌త‌క‌డం కోసం అబ‌ద్ధ‌మాడ‌తాన‌ని, అయినా ఓ న‌టుడు అధ్య‌క్షున్ని చంపి చాలా రోజులైంది.. ఇప్పుడు ఆ స‌మ‌యం మ‌ళ్లీ వ‌చ్చింది అని డెప్ అన్నాడు. అత‌ను స‌ర‌దాగా చేసిన ఈ కామెంట్స్ వివాద‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు ఈ వివాదాన్ని జానీ డెప్ ముందే ఉహించార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఎందుకంటే ``నేను మాట్లాడ‌బోయేది మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.. అది భ‌యంక‌రంగా ఉంటుంది`` అని డెప్ ముందే చెప్ప‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/