Begin typing your search above and press return to search.

జైల్లో ఆత్మహత్య చేసుకున్న McAfee వ్యవస్థాపకుడు ... ఏమైందంటే?

By:  Tupaki Desk   |   24 Jun 2021 7:19 AM GMT
జైల్లో ఆత్మహత్య చేసుకున్న McAfee వ్యవస్థాపకుడు ... ఏమైందంటే?
X
అమెరికా టెక్నాలజీ ఎంటర్ప్రెన్యుర్ జాన్ మెకాఫీ ఆత్మహత్య చేసుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి అమెరికాకు రప్పించడానికి స్పానిష్ హైకోర్టు అధికారం ఇవ్వడంతో తన జైలు గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మకాఫీ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కు మార్గదర్శకుడు. పన్ను ఎగవేత ఆరోపణలతో పాటు, న్యూయార్క్‌ లో క్రిప్టోకరెన్సీ మోసం కేసులో కూడా ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. మెకాఫీని బార్సిలోనా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. తరువాత అక్టోబర్‌ లో అక్కడ జైలుకి తరలించారు. ప్రస్తుతం జైలు అధికారులు మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మెకాఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్ హైకోర్టు అంగీకరించిందని బుధవారం విడుదల చేసిన కోర్టు పత్రం తెలిపింది. 75 ఏళ్ల వయసున్న యు.ఎస్ వ్యక్తి బుధవారం తన సెల్‌ లో చనిపోయినట్లు ప్రాంతీయ న్యాయ విభాగం ధృవీకరించింది. తన సాఫ్ట్‌ వేర్ కంపెనీని 2011 లో ఇంటెల్‌ కు మకాఫీ విక్రయించారు. ఆ తర్వాత వ్యాపారాల్లో అతను ఎలాంటి ప్రమేయం లేదు. రంగురంగుల జీవితాన్ని గడిపాడు. సైద్ధాంతిక కారణాలతో ఎనిమిదేళ్లుగా తాను అమెరికా ఆదాయపు పన్ను చెల్లించలేదని 2019 లో అతను చెప్పాడు. ఆ సంవత్సరం, అతను విచారణను తప్పించుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ నుంచి వెళ్లిపోయాడు.

క్రిప్టోకరెన్సీని ఉపయోగించి యుఎస్ వాణిజ్య ఆంక్షలను నివారించడానికి క్యూబాకు సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. మెకాఫీ లిబర్టేరియన్ పార్టీ నుంచి యుఎస్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావించారు. తనకు కనీసం 47 మంది పిల్లలు పుట్టారని 2018 లో చెప్పిన మకాఫీ, బెలిజ్‌ లో చాలా సంవత్సరాలు నివసించారు. 2012 లో ఒక పొరుగింటివారి హత్య కేసులో పోలీసులు అతనిని ప్రశ్నించిన తరువాత అతను పారిపోయాడు. ఆయనపై వచ్చిన అభియోగాలు నిజమని తేలితే 30 ఏళ్ళ జైలు శిక్ష విధించేవారు. కాగా జైల్లో తాను ఉరి వేసుకుంటే అది తన తప్పు కాదని జాన్ అప్పట్లోనే ట్వీట్ చేశారు. క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేయడం ద్వారా తన జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులను ఓ డాక్యుమెంటరీకి అమ్మడం ద్వారా ఆయన లక్షల డాలర్లను ఆర్జించారు.