Begin typing your search above and press return to search.

ఎవరీ జాన్ బ్రిట్టాస్..సుప్రీం పై బ్రాహ్మణుల పెత్తనం పై సంచలన ప్రసంగం

By:  Tupaki Desk   |   23 Dec 2021 8:30 AM GMT
ఎవరీ జాన్ బ్రిట్టాస్..సుప్రీం పై బ్రాహ్మణుల పెత్తనం పై సంచలన ప్రసంగం
X
ప్రధాన మీడియా లో ప్రముఖంగా కవర్ కాని సంచలన ఉదంతం ఒకటి మూడు రోజుల క్రితం చోటు చేసుకుంది. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వామపక్ష రాజ్యసభ సభ్యుడు.. పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగం ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది. ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల పై చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. ఆయన లేవనెత్తిన అంశాలు మామూలు కాదని.. ఇటీవల కాలంలో మరెవరూ చేయలేని సాహసంగా అభివర్ణిస్తున్నారు.

పార్లమెంటు లో మొదటి సారి మాట్లాడిన ఆయన.. తన తొలి ప్రసంగం తోనే దేశ వ్యాప్తంగా ఆయన ఎవరన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తిని పెంచేలా చేశారు. ఇంతకీ ఈ జాన్ బ్రిట్టాస్ ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందిన వారు? పార్లమెంటు లో ఆయన ప్రస్తావించిన అంశాలు ఎందుకు సంచలనంగా మారాయి? ఆయన ప్రసంగం లోని కీలక అంశాలు ఏమిటి? అన్న వివరాల్ని చూస్తే..

జాన్ బ్రిట్టాస్ కేరళకు చెందిన వామపక్ష పార్టీకి చెందిన నేత.

ఆయన్ను రాజ్యసభకు పార్టీ ఎంపిక చేసింది. తొలిసారి ప్రసంగించిన ఆయన.. తన తొలి స్పీచ్ నే దేశం యావత్తు ఆయన గురించి.. ఆయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకునేలా చేశారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఆయన వ్యాఖ్యలకు అటు జాతీయ మీడియాలో కానీ.. ప్రాంతీయ మీడియాలో కానీ పెద్దగా చోటు దక్కలేదు. అందుకు భిన్నంగా వెబ్ లో మాత్రం ఆయన మాట్లాడిన మాటల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ.. ఆ ప్రసంగం గురించి జాతీయ మీడియా పెద్దగా ప్రస్తావించలేదని.. ప్రచురించలేదని పేర్కొనటం గమనార్హం.

రాజ్యసభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన కొత్త సభ్యుడి మొదటి ప్రసంగమే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఆయన ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ప్రసంగాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ప్రశంసించారు. ఆయన ఏదో యథాలాపంగా మాట్లాడినట్లు కాకుండా.. తానీ అంశం మీద లోతైన అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడుతున్నట్లుగా ఆయన వాదన సాగింది. అయితే.. జాన్ ప్రసంగంలోని కొన్ని పాయింట్లను డిలీట్ చేస్తున్నట్లుగా చైర్లో కూర్చున్న ఉపసభాపతి ప్రకటించారు.

సాధారణంగా రాజకీయ నేతలు సైతం ప్రస్తావించేందుకు అంతగా ఇష్టపడని న్యాయవ్యస్థను ఆయన లక్ష్యంగా చేసుకోవటం.. నిజమే కదా.. ఆయన వాదనలోని అంశాలు ఇప్పటివరకు చర్చించని అంశాల దిక్కుగా సాగుతున్నాయన్న భావన కలిగేలా చేశాయి. ఇంతకీ ఆయన ఈ అంశాల గురించి ఎందుకు ప్రస్తావించారు? అన్నది చూస్తే.. జడ్జిల పెన్షన్ కు సంబంధించిన బిల్లు చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అసలు జడ్జిల నియామక ప్రక్రియే సరిగా లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కొలీజియం ఎంపిక చేసుకునే తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచంలో మరెక్కడా ఈ విధానం లేదన్న ఆయన.. కొలీజియం వల్ల న్యాయవ్యవస్థ తన స్వేచ్ఛా.. స్వాతంత్య్రాలను కోల్పోతోందని స్పష్టం చేశారు.

సీపీఎంకు చెందిన సీనియర్ నేత అయిన జాన్ బ్రిట్టాస్.. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. న్యాయమూర్తుల నియామకం తీరు అభ్యంతరకరమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారత్ లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉందన్నారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే పద్దతి మరెక్కడా లేదన్న ఆయన.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ సరిగా లేదని.. అభ్యంతరకరంగా ఉందంటూ సంచలనంగా మారారు.

అన్నింటి కి మించి న్యాయమూర్తుల నియామకం అనువంశికంగా మారిందని.. ఇదే మాత్రం వాంఛనీయం కాదన్నారు. జస్టిస్ అకిల్ ఖురేషి ఏం తప్పు చేశారని.. ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయలేదంటూ ధర్మసందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఒక శక్తివంతమైన నాయకుడ్ని జైలుకు పంపటమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించిన ఆయన.. అందుకే.. ఆ న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకు నామినేట్ చేయలేదన్న భావన కలిగేలా చేస్తుందన్నారు.

జాన్ బ్రిట్టాస్ చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు జ‌డ్జిల్లో ఒక‌రిగా ఉన్న వ్య‌క్తికి సంబంధించి, వారి కుటుంబీకులు ప‌లువురు ఇది వ‌ర‌కూ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యం ఉన్నారు. ఆ జ‌డ్జి త‌ల్లి వైపు నుంచి, తండ్రి వైపు నుంచి ప‌లువురు ఇప్ప‌టికే సుప్రీం కోర్టు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్పుడు ఆయన జడ్జి అయ్యారు.ఇది జడ్జి పదవి వారసత్వంగా మారటం కాదా?

- కాంగ్రెస్ విషయంలో వారసత్వరాజకీయాలు అంటూ బీజేపీ విమర్శలు సంధిస్తూ ఉంటుంది. మరి జడ్జిల నియామకంలో ఇదంతా ఏమిటి? జడ్జిల నియామకం లో డైవర్సిటీ కూడా లేదు.

- ఇప్పటివరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన వారిలో బ్రాహ్మణులు శాతం చాలా ఎక్కువ. ఇప్పటివరకు 47 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైతే.. వారిలో 14 మంది బ్రాహ్మణులే ఉన్నారు.

- 1950 నుంచి 1970 మధ్య కాలంలో సుప్రీంకోర్టులో గరిష్ఠంగా 14 మంది న్యాయమూర్తులు పని చేశారు. వారిలో 11 మంది బ్రాహ్మణులే ఉన్నారు. 1980 వరకు ఒక్క ఓబీసీ కానీ ఎస్సీ కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేకపోయారు.

- కొలీజియం వ్యవస్థ అనేది ఒక మిస్టరీగా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే వ్యవస్థ భారత్ లోనే ఉంది. నేను ఏ కులానికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. న్యాయమూర్తుల ఎంపిక తీరును మాత్రమే తప్పు పడుతున్నా. ఒకే కులస్తులు ఎక్కువ శాతం సుప్రీంకోర్టు జడ్జి పదవులు చేపట్టటం లో కిటుకు ఏమిటి?